- ప్రొఫెసర్ కోదండరాం..ఇండియా కూటమి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
సైఫాబాద్, వెలుగు : దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లను తొలగించారని, తెలంగాణలోనూ అదే పద్ధతిలో భారీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి పార్టీలు హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించాయి. ఇందులో పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఆపేసి లిస్టును పారదర్శకంగా పునఃపరిశీలించాలని, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు.
దీనికి బాధ్యత వహిస్తూ ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరారు. సికింద్రాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహలు మాట్లాడుతూ 2023లో తీసుకొచ్చిన ఎన్నికల చట్ట సంస్కరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటేష్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎస్.ఛాయాదేవి పాల్గొన్నారు.
సీఈసీ జ్ఞానేశ్ను తొలగించాల్సిందే...
ఇబ్రహీంపట్నం : ఓటు హక్కును తొలగించే కుట్ర చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనను అరెస్ట్చేయాలని డిమాండ్చేస్తూ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్కలెక్టరేట్ఎదుట కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ధర్నా చేశాయి. రంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు చిగురింత పారిజాత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి సామేల్, సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, కార్పొరేషన్చైర్మన్మల్ రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా అడిషనల్కలెక్టర్కు వినతిపత్రం
అందజేశారు.
వికారాబాద్లో...
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి ఎన్నెపల్లి బీజేఆర్చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్, పరిగి ఎమ్మెల్యే, ఎస్ఐఆర్ శిక్షణ కమిటీ చైర్మన్ టి. రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సంతోష పాల్గొన్నారు.
