పోలింగ్ కు అంతా సిద్ధం.. 22 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు

పోలింగ్ కు అంతా సిద్ధం.. 22 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోమొత్తం 22 వేల మంది పోలీస్ లతో బందోబస్తు నిర్వహిస్తున్నామ‌ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఆదివారం బషీర్ బాగ్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ..ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తుందని, 6 గంటల తరువాత ప్రచారానికి ఏ పార్టీ కి అనుమతి లేదని అన్నారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 89 వార్డ్ లు ఉన్నాయని, మొత్తం పోలింగ్ స్టేషన్ లు 4979 ఉన్నాయ‌న్నారు సీపీ. 2016 తో పోలిస్తే 817 కొత్త పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేశామని అన్నారు. నార్మల్ పోలింగ్ స్టేషన్ లు 2146, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు 1517, అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు 167 ఉన్నాయన్నారు

406 మొబైల్ పార్టీ లతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామ‌ని, హైదరాబాద్ లో 29 బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. హైపర్ సెన్సిటివ్ ఏరియా ల్లో 293 పికెట్ లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నిక‌ల క్ర‌మంలో 3066 మంది రౌడీ షీటర్ లను బైండోవర్ చేశామని, 1.45 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. మత్తు పదార్థాలు , మద్యం అన్ని కలిపి 10 లక్షలు విలువ చేసే పదార్థాలు సీజ్ చేశామని చెప్పారు.

ప్రతి పోలింగ్ స్టేషన్ కు జియో ట్యాగింగ్ చేశామని, కౌంటింగ్ కేంద్రాల బయట నిరంతర సీసీటీవీ కెమెరాల తో నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచామ‌ని చెప్పారు. డిసెంబర్ 1 ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంద‌ని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఇతర ప్రాంతాల నేతలు ఎవరైనా ఉంటే సాయంత్ర 6 గంటల తర్వాత హైదరాబాద్ వదిలి వెళ్ళాలని, పోలింగ్ రోజు ప్రతి అభ్యర్థికి కేవలం ఒక్క వార్డ్ వద్ద ఒక్క వాహనం మాత్రమే అనుమతి ఇచ్చామ‌ని చెప్పారు. ఎలక్షన్ ఏజెంట్ కూడా అదే వాహనం లో వెళ్ళాలన్నారు సీపీ అంజ‌నీ కుమార్