డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ అరెస్ట్.. తెలంగాణలో 600 మంది కస్టమర్లు : సీపీ

డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ అరెస్ట్.. తెలంగాణలో 600 మంది కస్టమర్లు : సీపీ

డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ ని గోవాలో అరెస్ట్  చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ పై హైదరాబాద్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారని చెప్పారు. హైదరాబాద్ లో ఎడ్విన్ పై మూడు డ్రగ్స్ కేసులు ఉన్నాయన్నారు. అతడు గత పదేండ్లుగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడని.. గోవాలోని ఒక రెస్టారెంట్ లో వర్కర్ గా చేస్తూ కాలక్రమంలో డ్రగ్స్ నెట్ వర్క్ లో కీలకంగా మారాడని తెలిపారు. ఇతడితో దాదాపు 50 వేల మంది కస్టమర్స్ రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని చెప్పారు.  

వందల కోట్ల డబ్బును డ్రగ్స్ ద్వారా ఎడ్విన్ సంపాదించాడని, గోవాలో అతడికి మూడు విలాసవంతమైన ఇండ్లు ఉన్నాయని సీవీ ఆనంద్ వివరించారు. గోవా లో ఎడ్విన్ పెద్ద మ్యూజిక్ పార్టీస్ ఏర్పాటు చేసి జోరుగా డ్రగ్స్ విక్రయించేవాడని చెప్పారు. ఎడ్విన్ అరెస్ట్ కు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్న సీవీ ఆనంద్.. అరెస్ట్ చేస్తే చాలా మంది పెద్దలు అతడిని తప్పించే ప్రయత్నం చేశారన్నారు. ఎడ్విన్ డ్రగ్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని గోవాలో హైదరాబాద్ పోలీసులు కూల్చివేశారని చెప్పారు. తెలంగాణ లో అతడికి 600 మంది కస్టమర్లున్నారన్నారు. గోవాలో బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో ఎడ్విన్ నిందితుడుగా ఉన్నాడని తెలిపారు.