
హైదరాబాద్ పేరు చెప్పి.. ఇక్కడ దొరికే ఫేమస్ ఫుడ్ ఐటమ్ పేరు చెప్పమని అడిగితే.. అందరూ టక్కున చెప్పేది హైదరాబాదీ దమ్కా బిర్యానీయే. అంతలా ప్రేమిస్తారు.. మనోళ్లు దమ్ బిర్యానీని. చుట్టాలొస్తే బిర్యానీ, దోస్తులు కలిస్తే బిర్యానీ, రోజూ తినే వంట బోర్ కొడితే బిర్యానీ.. బిర్యానీని మించిన రుచిని ఎందులోనూ వెతుక్కోవడానికి ఇష్టపడం. అయితే.. హైదరాబాద్‌లో బిర్యానీతో పాటు.. కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఫేమస్. బిర్యానీతో సమానంగా హైదరాబాదీలను, హైదరాబాద్‌కి వచ్చిన గెస్ట్‌లను నోరూరించి.. గౌరవించే ఆ ఫుడ్ ఐటమ్స్ ఇవే..
పాయా నాన్
ఇది హైదరాబాదీలు ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్. రుచికి రుచి.. బలానికి బలం దీని స్పెషాలిటీ. మటన్ పాయాకు మసాలా రుచి తగిలించి నాన్ కి రోటీతో కలిపి లాగిస్తుంటే.. మసాలా ఘాటు నషాలానికంటుతుంటే.. రుచి పుర్రెకు తగులుతది. గోధుమ పిండి, మైదాపిండితో చేసే నాన్ కి రోటీ కండపుష్టికి ఉపయోగపడితే.. మటన్ బొక్కలతో మరిగించిన పాయా ఎముక పుష్టికి సహాయపడుతుంది. ఇక మసాలా దినుసులు.. దగ్గు, కఫం, జలుబు, తలనొప్పి, ఒత్తిడి, మగత వంటి వాటిని మటుమాయం చేస్తుంది. నాంపల్లి రైల్వే స్టేషన్‌లోని అజిజియా హోటల్, చాదర్‌ఘాట్‌లోని నయాగరా హోటల్లలో దొరికే పాయా, నాన్ ఓసారి టేస్ట్ చూడండి. వాహ్.. అనకుండా ఉండలేరు.
హైదరాబాదీ చాట్
వేడి వేడి సూపులో.. ఉడకబెట్టిన శెనగ బఠాణీలు వేసి అంచుకు ఉల్లిగడ్డ వేసుకొని గుటుక్కున మింగే పానీపూరి టేస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాద్‌లో పానీపూరీలో చాలావరకు ఉడికించిన శెనగలే వాడతారు. కానీ.. కొన్నిప్రాంతాల్లో ఉడికించిన ఆలూపేస్ట్ని పానీపూరిలో పెట్టి ఇస్తారు. ఆర్డర్ ఇచ్చిన పానీపూరీ తిన్న తర్వాత లాస్ట్‌లో ఒక కాంప్లిమెంటరీ పానీపూరి తినకపోతే.. మన ఆత్మ శాంతించదు. కదా.. అందులోనే అసలు పానీపూరీ రుచి దాగుందేమో అనిపిస్తుంది. హైదరాబాద్‌లో దొరికే పానీపూరీలో మసాలా పూరీ, పానీ పూరీ, రగడా పూరీ ఇలా చాలా రకాలుంటాయి. జూబ్లీహిల్స్‌లోని మహారాజా చాట్, బర్కత్‌పురాలోని మయూర్ పాన్‌షాప్, గచ్చిబౌలిలోని సర్దార్జీ దాబా, కోఠీలోని గోకుల్ చాట్ వంటి చాట్సెంటర్లలో దొరికే పానీపూరీ రుచి వేరే ప్రాంతాల్లో దొరకదు. పక్కా హైదరాబాదీ ఫ్లేవర్‌లో ఇక్కడ దొరికే పానీపూరీ రుచి ఆస్వాదించాల్సిందే తప్పితే.. మాటల్లో చెప్పడం కాస్త కష్టమే.
దోశె, ఇడ్లీ
‘ఇవి కూడా హైదారాబాద్‌లో స్పెషలేంటి? ఎక్కడైనా దొరుకుతాయి కదా’ అని ఆశ్చర్యపోకండి. స్పెషాలిటీ లేనిదే.. దాని గురించి ప్రస్తావన రాదు కదా. చెన్నై, విజయవాడ, గుంటూరులో దొరికే ఇడ్లీ, దోశె రుచి వేరు. హైదరాబాద్‌లో దొరికే దోశె, ఇడ్లీ రుచి వేరు. నాంపల్లిలో రామ్‌కి దోశె, గోవింద్‌కి బండి, బేగంబజార్‌లో ప్రగతి టిఫిన్స్లాంటి కొన్నిచోట్ల దొరికే దోశె, ఇడ్లీ రుచి ఇంకెక్కడ దొరకదు అని గట్టిగా చెప్పొచ్చు. ఇక్కడ దొరికే దోశె, ఇడ్లీలో నెయ్యి, మసాలా, బటర్, చీజ్‌లతో పాటు.. కస్టమర్ల మీద ప్రేమ, పనిలో ఉన్న అనుభవం కూడా కలుపుతారు. అందుకే.. ఇక్కడ దొరికే దోశె, ఇడ్లీ ఫేమస్ అయ్యాయి. బిర్యానీతో సమానంగా రుచిని అందించే జాబితాలో చోటు సంపాదించాయి.
బర్గర్
ఈ పేరు చెప్పగానే.. అందరికీ మెక్ డొనాల్డ్ బర్గర్లు గుర్తుకొస్తాయి. కానీ.. హైదరాబాద్‌లో దొరికే బర్గర్లు అలాంటివి కాదు. ఆ బర్గర్లకు, ఈ బర్గర్లకు తేడా ఉంటుంది. చేత్తో తయారుచేసిన హైదరాబాదీ బర్గర్లు ఇవి. టొమాటో కెచప్, మయో, బాగా వేయించిన ఆలూ చిప్స్ కలిపి ఈ బర్గర్లు తయారుచేస్తారు. హైదరాబాదీ బేకరీల్లో దొరికే బర్గర్లకు, మెక్ డొనాల్డ్ వాళ్లు అమ్మే బర్గర్లకు నత్తకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది రుచిలో. కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, టొమాటో, చీజ్ కలిపి హైదరాబాద్ బేకరీల్లో దొరికే వెజ్, నాన్‌వెజ్ బర్గర్లు ఇక్కడి ప్రత్యేకం. ఈ బర్గర్లు టేస్ట్ చేయాలంటే హిమాయత్‌నగర్‌లోని కింగ్ అండ్ కార్డినల్ బేకరీ, ఎంజీ రోడ్డులోని యూనివర్సల్ బేకరీ, బంజారాహిల్స్‌లోని మౌంటెన్ బేకరీ, అబిడ్స్‌లోని జాన్స్ బేకరీకి వెళ్లండి. ఇంకా సిటీలోని చాలా బేకరీల్లో హైదరాబాదీ బర్గర్లు దొరుకుతాయి. ధర తక్కువ.. రుచి ఎక్కువ.
ఇరానీ చాయ్, సమోసా
పొద్దున్నే నాస్తా చేయగానే.. ఒక కప్పు ఇరానీ చాయ్ తాగితే.. ఆ రోజుకు కావాల్సిన ఎనర్జీ అంతా.. బాడీలో ఒదిగిపోతుంది. ఇరానీ చాయ్ పుట్టింది ఇరాన్లో అయినా.. మన దగ్గర ఉన్నంత డిమాండ్ అక్కడ ఉండదేమో. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఈ చాయ్ ఘుమఘుమలే. రెండు సమోసాలు తిని.. ఒక్క కప్పు ఇరానీ చాయ్ తాగితే.. ఆ మజా మాటల్లో చెప్పలేం. సమోసా ప్లేస్‌లో ఉస్మానియా బిస్కెట్లు తింటే.. అదో రకమైన రుచి. దేని రుచి దానిదే. రెడ్‌హిల్స్‌లోని సుభాన్ బేకరీ, సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ బిర్యానీ సెంటర్లో దొరికే చాయ్, బ్లూసీ కేఫ్, లక్డీకాపూల్‌లోని కేఫ్ నీలోఫర్, హిమాయత్‌నగర్‌లోని కేఫ్ సిటీ, బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ వన్‌లో సర్వీ చాయ్ నోరూరించే ఇరానీ ఛాయ్ అడ్డాలు.
షవర్మా..
ఈ అరేబియన్, లెబనీస్ ఫుడ్‌కి హైదరాబాద్‌లో వేలల్లో అభిమానులున్నారు. జ్యూసీగా నోరూరిస్తూ.. మధ్యమధ్యలో పచ్చికారం, ఉల్లిగడ్డ ముక్కలు, చికెన్ ముక్కలు తగులుతూ తింటుంటే.. నోరంతా కమ్మటి రుచుల వేడుక చేసుకుంటుంది కదా అనిపిస్తుంది షవర్మా తింటుంటే. సన్నటి సెగ మీద ఎర్రగా కాలుతూ.. మసాలా, నెయ్యి, బటర్ల రుచులతో అలంకరించుకొని హైదరాబాద్ రెస్టారెంట్లలో దొరికే షవర్మా మిగతా ప్రాంతాలతో పోలిస్తే స్పెషల్. నాంపల్లిలోని ఫీల్ ఇన్ సౌదీ రెస్టారెంట్, పీజీ రోడ్‌లోని షవర్మా హౌజ్, టోలిచౌకిలోని లిమ్రా అరేబియన్ షవర్మా, కూకట్‌పల్లిలోని రోల్ ఆన్, బంజారాహిల్స్‌లోని స్పైస్ సిక్స్, ఖార్ఖానాలోని గ్రిల్9, శ్రీనగర్ కాలనీలోని సమ్మీస్ షవర్మాస్లలో మీరు కోరుకునే స్పెషల్ హైదరాబాదీ రుచుల షవర్మా దొరుకుతాయి. కావాలంటే ఓసారి టేస్ట్ చేసి చూడండి.
ఇవే కాదు.. నగరంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. కాకపోతే.. అన్నింటినీ ఇక్కడ లిస్ట్ ఇవ్వడం కుదరదు కాబట్టి. నగరంలో బాగా ఫేమస్ అయిన కొన్నింటిని మాత్రమే ఇక్కడ చెప్పా.