ఐఎస్‌‌‌‌ఎల్‌‌ చాంపియన్‌‌గా హైదరాబాద్‌‌ ఎఫ్‌‌సీ

ఐఎస్‌‌‌‌ఎల్‌‌ చాంపియన్‌‌గా హైదరాబాద్‌‌ ఎఫ్‌‌సీ
  • ఫైనల్లో  కేరళ బ్లాస్టర్స్‌‌పై థ్రిల్లింగ్‌‌ విక్టరీ

హైదరాబాద్‌‌‌‌ ఫుట్‌‌బాల్‌‌ క్లబ్‌‌ (హెచ్​ఎఫ్​సీ) చరిత్ర సృష్టించింది. ఇండియన్‌‌ సూపర్‌‌ లీగ్‌‌ (ఐఎస్‌‌ఎల్‌‌)లో అడుగు పెట్టిన మూడో సీజన్‌‌లోనే విజేతగా నిలిచి ఔరా అనిపిం చింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి సంచలనాలు నమోదు చేస్తూ దూసుకొచ్చిన నవాబుల జట్టు అత్యంత హోరాహోరీగా సాగిన అంతిమ పోరులోనూ అసాధారణ ఆట చూపెట్టింది! మూడోసారి ఫైనల్​ ఆడుతున్న కేరళ బ్లాస్టర్స్‌‌ విసిరిన సవాల్‌‌ను ఛేదించింది..! మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 0‑1తో ఓటమి అంచుల్లో నిలిచిన దశ నుంచి పుంజుకున్న హెచ్‌‌ఎఫ్‌‌సీ కేరళను  ‘షూటౌట్‌‌’ చేసి  నయా బాద్‌‌షాగా నిలిచింది. 

ఫట్రోడా (గోవా): ఇండియన్‌‌ సూపర్‌‌ లీగ్‌‌(ఐఎస్‌‌ఎల్‌‌) 8వ సీజన్​లో హైదరాబాద్‌‌ ఎఫ్‌‌సీ అద్భుతం చేసింది. ఫైనల్‌‌ చేరిన తొలిసారే చాంపియన్‌‌గా నిలిచింది. ఆదివారం ఇక్కడి నెహ్రూ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్‌‌ పెనాల్టీ షూటౌట్‌‌లో 3–-1కేరళ బ్లాస్టర్స్‌‌ను ఓడించింది.  నిర్ణీత సమయంలో ఇరు జట్లూ 1-–1తో సమంగా నిలిచాయి. కేరళ ప్లేయర్‌‌ 68 నిమిషంలో గోల్‌‌ కొట్టగా.. హెచ్‌‌ఎఫ్‌‌సీ తరఫున సాహిల్​ తవోరా 88వ నిమిషంలో గోల్​తో  స్కోరు సమం చేశాడు. ఆపై, 30 నిమిషాల ఎక్స్‌‌ట్రా టైమ్‌‌లో ఒక్క గోల్‌‌ కూడా రాకపోవడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌‌ అనివార్యమైంది. షూటౌట్‌‌లో కేరళ నాలుగు ప్రయత్నాల్లో ఒకేసారి గోల్‌‌ కొట్టింది. అదే టైమ్‌‌లో హైదరాబాద్‌‌ తరఫున జావో విక్టర్‌‌, ఖాసా కమారా, హలీ చరణ్‌‌ నర్జారీ గోల్స్‌‌ చేసి టీమ్‌‌ను గెలిపించారు. సెకండాఫ్‌‌లో కేరళకు గోల్‌‌ ఇచ్చిన  హైదరాబాద్‌‌ గోల్‌‌ కీపర్‌‌ లక్ష్మీకాంత్‌‌ కట్టిమణి షూటౌట్‌‌లో ఆ టీమ్‌‌ మూడు షాట్లను అడ్డుకొని జీరో నుంచి హీరో అయ్యాడు.

నువ్వానేనా
ఈ సీజన్‌‌లో నిలకడగా ఆడిన హైదరాబాద్‌‌, కేరళ మధ్య టైటిల్‌‌ ఫైట్ ఊహించినట్టే నువ్వానేనా అన్నట్టు సాగింది. రెండు జట్లూ ఆరంభం నుంచే గోల్‌‌ లక్ష్యంగా దూకుడుగా ఆడాయి. బాల్‌‌ను ఎక్కువగా తమ ఆధీనంలో ఉంచుకున్న కేరళ స్ట్రయికర్స్‌‌ దాడులను హైదరాబాద్‌‌ డిఫెండర్లు బాగానే తిప్పికొట్టారు. 39వ నిమిషంలో సబ్‌‌స్టిట్యూట్‌‌గా గ్రౌండ్‌‌లోకి వచ్చిన హైదరాబాద్‌‌ ప్లేయర్‌‌  సివేరియా ఫస్టాఫ్‌‌కు ముందు గోల్‌‌ కొట్టినంత పని చేశాడు. కానీ, అతని షాట్‌‌ను కేరళ గోల్‌‌ కీపర్‌‌ ప్రభ్‌‌సుఖాన్‌‌ గిల్‌‌ నిలువరించగా ఫస్టాఫ్‌‌ 0–0గా ముగిసింది. సెకండాఫ్‌‌ మొదలైన వెంటనే హైదరాబాద్‌‌కు వరుస అవకాశాలు వచ్చినా వాటిలో ఒక్కదాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది. అదే టైమ్‌‌లో హెచ్‌‌ఎఫ్‌‌సీ డిఫెన్స్‌‌ను ఛేదించిన కేరళ ఫలితం రాబట్టింది. 68వ నిమిషంలో స్ట్రయికర్‌‌ కేపీ రాహుల్‌‌ మ్యాచ్‌‌లో తొలి గోల్‌‌ కొట్టగా.. కేరళ 1–0తో ఆధిక్యం సాధించింది. పది నిమిషాల్లోపే స్కోరు సమం చేసే చాన్స్‌‌ను హైదరాబాద్‌‌ మిస్‌‌ చేసింది. 76వ నిమిషంలో దక్కిన ఫ్రీ కిక్‌‌కు స్టార్‌‌ ప్లేయర్‌‌  ఓగ్బాచె కొట్టిన షాట్‌‌ను కేరళ కీపర్‌‌ అడ్డుకున్నాడు. మరోవైపు మ్యాచ్‌‌ టైమ్‌‌ దగ్గరపడటంతో హైదరాబాద్‌‌పై ఒత్తిడి పెరిగింది. అయితే, రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. హెచ్‌‌ఎఫ్‌‌సీ మ్యాజిక్‌‌ చేసింది.  హలీచరన్‌‌ నర్జారీ  బాక్స్‌‌లోకి ఇచ్చిన పాస్‌‌ను అందుకున్న సాహిల్‌‌ తవోరా .. కేరళ గోల్‌‌కీపర్‌‌ను ఏమారుస్తూ  కొట్టిన గోల్‌‌తో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. దీంతో స్కోరు 1–-1తో సమం అవడంతో మ్యాచ్‌‌ ఎక్స్‌‌ట్రా టైమ్‌‌కు దారి తీసింది. ఇందులోనూ రెండు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. కానీ, ఎవ్వరూ గోల్‌‌ కొట్టకపోవడంతో షూటౌట్‌‌ అనివార్యం అవగా.. హైదరాబాద్‌‌ అద్భుత పెర్ఫామెన్స్‌‌తో గెలిచింది.