
- మీరేమైనా యుద్ధానికి వెళుతున్నారా?
- హైడ్రాను నిలదీసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ హైడ్రా చేపడుతున్న హడావుడి చర్యలను హైకోర్టు బుధవారం తప్పుబట్టింది. అసలు హైడ్రా వాహనాలకు అలాంటి అసహజ రంగులెందుకని ప్రశ్నించింది. ‘‘మీరేమైనా యుద్ధానికి వెళుతున్నారా? ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా మీరు విధులు నిర్వహిస్తారా’’ అంటూ నిలదీసింది. ప్రభుత్వ అధికారులు కోర్టు ఉత్తర్వుల అమలుపై ఉదాసీనంగా ఉంటున్నారని, కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసినప్పుడు హాజరవ్వాలని ఆదేశిస్తే.. వాటినీ తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని పేర్కొంది.
సరైన సమయం కోసం చూస్తున్నామని.. అప్పుడు కోర్టుకు ఉన్న అధికారం ఏమిటో చూపిస్తామని హెచ్చరించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో తమ్మిడిగుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలంలో తమ్మిడిగుంట చెరువు పునరుద్ధరణ పనుల్లో భాగంగా పట్టా భూముల్లో జోక్యం చేసుకుంటున్నారని హైకోర్టులో ఎస్.వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. ఇరుపక్షాలు యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వీటిని ఉల్లంఘిస్తూ హైడ్రా చర్యలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు.
ప్రభుత్వ లాయర్ వాదిస్తూ పిటిషనర్‌కు చెందిన స్థలం 6 ఎకరాల్లో పనులు చేపట్టబోమని, మిగిలిన ప్రాంతంలో పనులు చేయడానికి అనుమతించాలన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకొని.. చెరువుల పునరుద్ధరణ పనులను అడ్డుకోవడంలేదని.. నిబంధనల ప్రకారం హడావుడి లేకుండా నెమ్మదిగా ఎందుకు పనిచేయరని ప్రశ్నించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తమ్మిడిగుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధికి సంబంధించిన పిటిషన్‌తోపాటు కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణను సోమవారం చేపడతామన్నారు.