
- భక్తులతో కిటకిటలాడుతున్న దుర్గామాత మండపాలు
- నవరాత్రుల్లో చివరి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు
- జింఖానా గ్రౌండ్స్, మాదాపూర్ శిల్పారామంలో కల్చరల్ ప్రోగ్రామ్స్
- పలు ప్రాంతాల్లో రావణ దహనానికి ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు : దసరా ఉత్సవాలకు గ్రేటర్ సిటీ సిద్ధమైంది. సిటీలోని అమ్మవారి ఆలయాలు, దుర్గామాత మండపాలను దసరా వేడుకల కోసం అందంగా ముస్తాబు చేశారు. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు వివిధ రూపాల్లో పూజలు అందుకున్న దుర్గామాతకు చివరగా సోమవారం విజయదశమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నారు. నేటితో నవరాత్రి వేడుకలు ముగుస్తుండటంతో మండపాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సోమవారం దసరా పండుగ సందర్భంగా సిటీలోని పలు ప్రాంతాల్లో జమ్మి పూజ, రావణ దహన కార్యక్రమాలు నిర్వహించను
న్నారు. కృష్ణకాంత్ పార్క్, అంబర్‌పేటలోని ఎంసీహెచ్గ్రౌండ్, మెట్టుగూడ గ్రౌండ్ తదితర ప్రాంతాల్లోరావణ దహన కార్యక్రమం జరగనుంది.
ప్రత్యేక కార్యక్రమాలు..
జింఖానా గ్రౌండ్స్‌లోని హునార్ మహోత్సవ్ పేరుతో దేవి శరన్నవరాత్రి ముగింపు, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. కల్చరల్, స్పెషల్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్‌ను ఏర్పాటు చేశారు. మాదాపూర్ లోని శిల్పాకళా వేదికలో జమ్మిపూజ నిర్వహించనున్నారు. అనంతరం కల్చరల్ ప్రోగ్రామ్స్ జరగనున్నాయి. ‘మహిషాసుర మర్దిని’ భరత నాట్య ప్రదర్శన, కూచిపూడి, కర్ణాటక వోకల్ సంగీత కచేరిని నిర్వహించనున్నారు.
బెంగాలీల వేడుకలు..వెరీ స్పెషల్
సిటీలో దసరా, శరన్నవరాత్రి ఉత్సవాలు అనగానే ప్రధానంగా బెంగాలీలే గుర్తొస్తారు. వీరు సిటీలోని పలు ప్రాంతాల్లో ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్, ఎన్టీఆర్ స్టేడియం ప్రాంతాల్లో హైదరాబాద్ బెంగాలీ సమితి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు చేస్తుంటారు. శరన్నవరాత్రుల ముగింపు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు దాండియా, వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్‌ను బెంగాలీలు నిర్వహిస్తున్నారు.