V6 News

జీడిమెట్ల, బాలానగర్.. కూకట్ పల్లి, సనత్నగర్ ఏరియాల్లో ఉంటున్నారా..? హిల్ట్ పాలసీ గురించి తెలుసా..?

జీడిమెట్ల, బాలానగర్.. కూకట్ పల్లి,  సనత్నగర్ ఏరియాల్లో ఉంటున్నారా..? హిల్ట్ పాలసీ గురించి తెలుసా..?

‘హిల్ట్’గా పేర్కొంటున్న హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానంపై గత కొన్ని రోజులుగా రాజకీయ దుమారం రేగుతోంది. ‘హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపారంటూ.. ఇందులో 5 లక్షల కోట్ల భూస్కాం! హెచ్ఐఎల్టీపీ పేరిట 9,292 ఎకరాలు దోచుకునే కుట్రదాగి ఉన్నది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

హిల్ట్ పేరుతో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం జరుగుతున్నాయని.. జోక్యం చేసుకొని నిలువరించాలని రాష్ట్ర గవర్నర్కు  బీజేపీ రాష్ట్ర నాయకత్వం విజ్ఞప్తి చేసింది. ‘హిల్ట్ పాలసీలో రూ.5 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని.. తెలంగాణ ఆస్తులు కాపాడాలి’ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య  ప్రధాన మంత్రికి లేఖ రాశారు. పరిశ్రమల భూములు కన్వర్జేషన్​పై అఖిలపక్ష సమావేశం పెట్టాలని వామపక్షాలు కోరుతున్నాయి. 

పరిశ్రమలకు కేటాయించిన భూములను కన్వర్షన్  చేస్తూ ఇచ్చిన  జీవో-27ను రద్దు చేయాలని హైకోర్టులో కేసువేయటం.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు నోటీసులు ఇచ్చింది. హిల్ట్  భూముల లోగుట్టు పరిశీలించటానికి బీఆర్ఎస్ మాజీ మంత్రులు,  శాసనసభ్యుల  బృందాలు  ఈ  నెల 4, 5 తేదీలలో జీడిమెట్ల, బాలానగర్, కూకట్ పల్లి,  సనత్​నగర్,  నాచారం,  మౌలాలి,  తదితర  ప్రాంతాలలోని పారిశ్రామికవాడలకు వెళ్లి గతంలో కేటాయించిన భూములను పరిశీలించారు. వారు పరిశీలించి చేసిన ప్రకటనలు చూస్తుంటే లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలుస్తోంది. 

హిల్ట్ పాలసీ ఏం చెపుతోంది
హైదరాబాద్ సిటీ లోపల ఉన్న కాలుష్య కారక,  అవుట్ డేటెడ్  టెక్నాలజీతో నడుస్తున్న పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు( ఓఆర్ఆర్) అవతలకు తరలించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ కసరత్తు ప్రారంభించింది.  బాలానగర్, కాటేదాన్,  కూకట్​పల్లి, ఉప్పల్,  జీడిమెట్ల, చర్లపల్లి తదితర 22 ఇండస్ట్రియల్ ఏరియాల్లోని భూములను ఇతర అవసరాలకు వాడుకునేలా కొత్త పాలసీ రూపొందించింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్సఫర్మేషన్ పాలసీ ( హెచ్ఐఎల్టీపీ)ని నవంబర్ 17న  కేబినెట్ ఆమోదించి నవంబర్ 22న జీవో నెం.27ను  తీసుకొచ్చింది. 

దీని ప్రకారం 22 ఇండస్ట్రియల్ ఏరియాలోని  9,292.53  ఎకరాల భూములలో  ఖాయిలాపడి  మూతపడి ఉన్న పరిశ్రమల భూములు,  కాలుష్య కారకాలకు సంబంధించిన పరిశ్రమల భూములు ఉన్నవి.  ఇప్పటికే కొంతభాగం భూములు ఇతర అవసరాలకు వాడుతున్నందున,  మిగిలిన భూములను  కూడా  అదేవిధంగా వాడుకునేందుకు మార్చుకునేలా అవకాశం కల్పించింది. ఈ మొత్తం భూములు 4,740.14  ఎకరాలని ప్రభుత్వం పేర్కొంది.

జనసాంద్రత మధ్య ఉన్న పరిశ్రమలను తరలించాలి
ప్రస్తుతం ఈ పారిశ్రామిక ప్రాంతాలు నగరం మధ్యలో ఉండి కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి.  సమీప ప్రాంతాలు బాగా అభివృద్ధి చెంది జన సాంద్రతను సంతరించుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రం 2013లోనే  రెసిడెన్షియల్ జోన్​లో ఉన్న కాలుష్య కారకాల పరిశ్రమలన్నింటినీ ఓఆర్ఆర్ అవతలికి తరలించాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించి జీవో 20ని తీసుకొచ్చింది.  దాని ప్రకారం కొన్ని కాలుష్య పరిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించాల్సి ఉంది.

గత  బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొన్ని కాలుష్య  పరిశ్రమలను మూసివేసి ఓఆర్ఆర్ అవతలికి పంపించింది.  మిగిలిన కొద్దిపాటి పరిశ్రమలు పాత సాంకేతికతనే  కొనసాగిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో  ప్రధాన నగరంలో భాగంగా మారిన ఆనాటి పారిశ్రామికవాడల  నుంచి  పరిశ్రమలను  ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు పంపాలని గతంలో పాలకులు అనేక ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయి.  ప్రస్తుత  కాంగ్రెస్  ప్రభుత్వం కూడా పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. 

తెర పైకి హిల్ట్ పాలసీ
పరిశ్రమలు తరలిపోయాక అతి విలువైన 9,292 ఎకరాల భూముల విషయంలో గత మాసాంతంలో తెరపైకి వచ్చింది హిల్ట్ విధానం.  పాత ప్రభుత్వాలు పారిశ్రామిక అవసరాల కోసం భూములు కేటాయించిన పారిశ్రామిక వాడలను, బహుళ వినియోగ జోనుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను ఎకరాకు లక్ష రూపాయల కంటే తక్కువకే  గతంలో ప్రభుత్వాలు కేటాయించాయి. 

వాటిని ప్రభుత్వ నిర్ణీత మార్కెట్ ధరలో 30 నుంచి 50 శాతం, అది కూడా రూ. కోటిలోపే  వన్  టైం  డెవలప్​మెంట్​ ఫీజు  కింద చెల్లించడం ద్వారా భూ యజమానులకు భూమిని ఇతర అవసరాలకు మార్చుకునే విధంగా వీలు కల్పించింది.  ఈ విధానం  గతంలో  బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేపట్టి  హైదరాబాద్​లోని  ఆజామాబాద్  పారిశ్రామికవాడలో 110 ఎకరాల భూములను, ఎల్బీ నగర్ లో  సిరీస్  కంపెనీ 100 ఎకరాలను  కూడా  క్రమబద్ధీకరించేందుకు చట్టం తీసుకొచ్చారు.  కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం భూములను  ప్రైవేట్ పరం చేసేందుకు అడుగులు వేసి, ప్రజా వ్యతిరేకతతో  వెనక్కి తగ్గింది.

9,292 ఎకరాల కన్వర్షన్ ఉత్తర్వులు
హైదరాబాద్  నగర  పరిసర ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా 1960, -70, -80 దశలకాలంలో ఆనాటి ప్రభుత్వాలు భారీగా భూములను సేకరించాయి.  నాచారం, మల్లాపూర్,  చర్లపల్లి,  మౌలాలి,  ఉప్పల్, కూకట్ పల్లి,  జీడిమెట్ల, రామచంద్రాపురం, పాశమైలారం, బాలానగర్, సనత్ నగర్, మేడ్చల్, పటాన్​చెరు, కాటేదాన్ తదితర ఇండస్ట్రియల్ సెక్టార్లలో భూములను  పలు పరిశ్రమలకు వందలకొద్దీ  ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించి  కేటాయించారు. 

ప్రస్తుతం ఈ భూములు ఇండస్ట్రియల్ యజమానుల చేతిలో ఉన్నాయి.  భూములు ప్రైవేటు  పరిశ్రమల యజమానులకు చెందినవి కావున  రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం చెల్లించాలని జీవో 27లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఈ ఉత్తర్వుల్లో ఇండస్ట్రియల్ భూములను ఇకపై మల్టీ పర్పస్ యూజ్డ్ జోన్​గా ప్రకటించింది.

22 పారిశ్రామికవాడల్లోని 9,292.53 ఎకరాల భూమిని  కన్వర్షన్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ భూములను అపార్ట్​మెంట్లు,  ఇంటిగ్రేటెడ్ టౌన్​షిప్స్,  నిర్మాణం కోసం  వినియోగించవచ్చని,  కార్యాలయాల  ఏర్పాటు, హోటల్స్, స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్,  రీసెర్చ్ సెంటర్స్​ నిర్మాణానికి వాడుకోవచ్చని ఉత్తర్వులలో  ప్రభుత్వం పేర్కొన్నది. పార్కులు, స్టోర్స్, కల్చరల్ సెంటర్లు, టెక్నాలజీ పార్కులు, క్యాంపస్​లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని వివరించింది. 

ఈ భూమిని అభివృద్ధి చేసుకునేందుకు.. 80 ఫీట్ల కన్నా తక్కువ వెడల్పు గల రోడ్లు ఉన్న ప్లాట్స్​కు 30 శాతం, 80  ఫీట్ల కన్నా ఎక్కువ వెడల్పు ఉన్న ప్లాట్​కు  50 శాతం  చెల్లించాలని పేర్కొంది.  మెజార్టీ భూమి 30 శాతం పరిధిలోకి వస్తుందని  స్పష్టం చేసింది.  ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని రెండు వాయిదాలలో 45 రోజుల్లో చెల్లించాలన్న నిబంధన పెట్టింది.

‘హిల్ట్’ను పునః సమీక్షించాలి
హిల్ట్ విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు తేలికగా కొట్టి పారేయాల్సిన అవసరం లేదు. ఈ విధానంలో పారదర్శకత పాటించకపోతే  కాంగ్రెస్​ప్రభుత్వానికి మరక అంటుకునే ప్రమాదం లేకపోలేదు. నిజానికి ఆ భూములను ప్రభుత్వమే తీసుకుని, యజమానులకు భూమికి బదులుగా ఓఆర్ఆర్ వెలుపల భూమి కేటాయించే అంశాన్ని పరిశీలించాలి. స్వాధీనం చేసుకున్న భూముల్లో  కొంత వేలం వేయడం, మరికొంత పేద, మధ్యతరగతి వర్గ గృహ పథకాలకు కేటాయించాలి. 

తద్వారా ఖజానాకు ఆదాయం, ప్రజల నివాసనికి గృహాలు సమకూర్చిన ప్రభుత్వంగా చరిత్రలో నిలిచే సువర్ణ అవకాశం లభిస్తుంది. కాబట్టి వామపక్ష పార్టీలు ఇతర సంస్థలు కోరుతున్నవిధంగా హిల్ట్ విషయంలో అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసి  పునః సమీక్ష అవసరం. 

ఉజ్జిని రత్నాకర్ రావు, సీపీఐ రాష్ట్ర సీనియర్ నేత