సన్ బర్న్ నహీ చలేగా!..  న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ఉక్కుపాదం

సన్ బర్న్ నహీ చలేగా!..  న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ఉక్కుపాదం
  •  డ్రగ్స్ వినియోగం ఉండే చాన్స్ ఉందనే..
  •  గతంలో పర్మిషన్ లేకుండానే ఈవెంట్స్ 
  • ఈ సారీ అదే తరహాలో  ఏర్పాట్లకు గ్రౌండ్ వర్క్
  •  బుక్ మై షోలో టికెట్లు అమ్మకానికి పెట్టిన సంస్థ
  •  స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు  

హైదరాబాద్: న్యూ ఇయర్ వేళ నిర్వహించే సన్ బర్న్ వేడుకలకు సర్కారు నో చెప్పింది. గతంలో గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ఏరియాల్లో గతంలో సన్ బర్న్ న్యూ ఇయర్ ఈవెంట్స్ చేసింది.  ఇప్పుడు కూడా  ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఈవెంట్స్ అనౌన్స్ చేసి… బుక్ మై షో ద్వారా ఆన్ లైన్లో భారీగా టిక్కెట్ల అమ్మకాలు మొదలు పెట్టింది.  31వ తేదీ రాత్రి కొత్త  సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సన్ బర్న్ సంస్థ ఈవెంట్లను నిర్వహిస్తుంది. ఇందులో మద్యంతో పాటు డ్రగ్స్ వినియోగించే అవకాశం ఉన్నందునే  సర్కారు ఈ  నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పర్మిషన్ లేకుండా ఎలాంటి ఈవెంట్లు నిర్వహించవద్దని, గీత దాటితే చట్టపరంగా చర్యలు తప్పవని సర్కారు హెచ్చరించింది. అవన్నీ ఇకపై ఇక్కడ నడవవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈవెంట్ నిర్వహణ కోసం బుక్ మై షో ఆన్ లైన్లో టికెట్లు విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న సీఎం.. పర్మిషన్ ఎవరిచ్చారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

డ్రగ్స్ పై కొరడా

హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్ పై పోలీసులు ఫోకస్ పెంచారు.  సన్ బర్న్ లాంటి ఈవెంట్స్ లో డ్రగ్స్ వాడుతున్నారని గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ సప్లయ్ పై సీరియస్ గా ఉన్నారు.  విద్యార్థులు, యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి న్యూఇయర్ ఈవెంట్స్ పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు.  ఎక్కడైనా డ్రగ్స్ వాడినట్టు తెలిస్తే ఎంతటి వారైనా జైలుకు పంపాలని పోలీసులు భావిస్తున్నారు.