- భూముల వేలానికి భారీ స్పందన
- హెచ్ఎండీఏ ఖజానాకు రూ.231 కోట్ల ఆదాయం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ గత రెండు రోజులుగా మోకిలాలో నిర్వహిస్తున్న భూముల వేలానికి భారీ స్పందన వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిలా గ్రామంలో సర్వేనెం. 96/పిలో 100 ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. దీని ద్వారా హెచ్ఎండీఏకు 231.65 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. సోమవారం 50 ప్లాట్లను, మంగళవారం మరో 50 ప్లాట్లను వేలం వేశారు. మొదట్నుంచీ మోకీలా భూములపై అధికారులకు భారీ అంచనాలే ఉన్నాయి. మేడిపల్లి లే ఔట్లో నిర్వహించిన ప్లాట్ల వేలంలో గరిష్టంగా ఒక గజం -రూ. 80 వేలు పలికి రికార్డు సృష్టించింది. తాజాగా ఇప్పుడు మోకిలాలో కూడా కనీస ధర చ. గ.నికి 50వేలుగా నిర్ణయించగా అత్యధికంగా 1,09,500 పలికింది. యావరేజిగా 75,640 రూపాయలు పలికినట్టు అధికారులు తెలిపారు. మోకిలాలో ప్లాట్లు భారీ ధర పలుకుతాయని ముందుగానే ఊహించిన అధికారులు తాజాగా పలికిన ధరతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎండీఏ ప్లాట్లకు సహజంగానే ప్రజల్లో ఉన్న నమ్మకం, క్లియర్ టైటిల్స్, వివాదాలు లేని భూములుగా పేరుంది.
మొత్తం 1,293 ప్లాట్లు
మోకిలాలో ప్రభుత్వానికి ఉన్న 165 ఎకరాల 37 గంటల భూమిలో అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ ఇండ్లు నిర్మించుకునేందుకు వీలుగా ఈ లేఔట్లో మొత్తం 1293 ప్లాట్లను అభివృద్ధి చేశారు. ఇందులో 100 ప్లాట్లను ఇప్పుడు వేలం వేశారు. ఒక్కో ప్లాట్‌ను 300 చ. గ.ల నుంచి 500 చ.గ.ల సైజుల్లో అభివృద్ధి చేశారు.ఈ లేఔట్లో ఎలక్ట్రికల్, రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సప్లయ్, ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్, పవర్ సప్లయ్, స్ర్టీట్లైట్స్, అన్ని రకాల మౌలిక సదుపాయాలను 18 నెలల్లోనే పూర్తి చేశారు. హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల వేలం ద్వారా వెస్ట్‌సిటీలో రియల్ఎస్టేట్ భారీగా పుంజుకున్నట్టు కూడా స్పష్టం అవుతోందని అధికారులు తెలిపారు.
