హైదరాబాద్లో దూసుకెళ్తున్న రియల్టీ

హైదరాబాద్లో దూసుకెళ్తున్న రియల్టీ
  • 23 శాతం పెరిగిన సిటీ​రెసిడెన్షియల్​ మార్కెట్​
  • 2011 హెచ్1 తరువాత ఇదే అత్యధికం
  • రెంట్​, ఆఫీసు మార్కెట్లకూ ఢోకా లేదు!  
  • నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్టులో వెల్లడి  

హైదరాబాద్​: సిటీలో రియల్టీ దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుత సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (హెచ్​1) హైదరాబాద్  రెసిడెన్షియల్ మార్కెట్ బాగా ఎదిగింది. కిందటి ఏడాది హెచ్​1తో పోలిస్తే ఈసారి అమ్మకాలు 23 శాతం పెరిగి 14,693 హౌసింగ్ యూనిట్లుగా రికార్డయ్యాయి. 2011 హెచ్1 తరువాత ఇంత ఎక్కువగా అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారని నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా రిపోర్టు ‘ఇండియా రియల్ ఎస్టేట్: హెచ్1 2022 ’లో వెల్లడించింది.  ఇందులోని వివరాల ప్రకారం...కరోనా మహమ్మారి వల్ల ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్​కు పెద్దగా ఎఫెక్ట్​ కాకపోవడంతో ఇండ్లకు డిమాండ్​ తగ్గలేదు.  2022 హెచ్1లో కొత్త ఇండ్ల లాంచ్​లు ఏడాది లెక్కన 28% పెరిగి 21,356 హౌసింగ్ యూ నిట్లకు చేరుకున్నాయి.  రెసిడెన్షియల్​ సెగ్మెంట్​లో పశ్చిమ హైదరాబాద్ తన ఆధిక్యాన్ని కొనసాగించింది. 2022 హెచ్ 1లో జరిగిన మొత్తం అమ్మకాల్లో ఇది 62% మార్కెట్ వాటా సాధించింది  ఆఫీస్ మార్కెట్ పనితీరును గమనిస్తే 2022 జనవరి నుంచి జూన్ వరకు బిజినెస్​ బాగుంది. లావాదేవీలు 101శాతం పెరిగాయి. ఈ అమ్మకాలు సైజు 2021 హెచ్1లో 1.07 మిలియన్ చదరపు అడుగులు ఉండగా, ఈసారి 3.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. కొత్త ఆఫీసులు పూర్తి కావడంతో అదనంగా  జాగా అందుబాటులోకి వచ్చింది. ఐటీ రంగం ఆఫీస్​ స్పేస్​కు వెన్నెముకగా నిలుస్తోంది. ఐటీ లావాదేవీలు ఏడాది లెక్కన ప్రాతిపదికన 62శాతం పెరిగాయి.  2021 హెచ్1లో ఇవి 0.8 మిలియన్ చదరపు అడుగులు ఉండగా, 2022 హెచ్1 లో 1.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగాయి.  రెంట్​మార్కెట్ కూడా 2022 హెచ్1 లోనూ జోరు మీద ఉంది. రెంటల్​ ట్రాన్సాక్షన్లు ఏడాది లెక్కన 3.3శాతం పెరిగాయి. సబర్బన్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (ఎస్బీడీ) ఈ మార్కెట్ లో తన ఆధిక్యాన్ని కొనసాగించిందని నైట్​ఫ్రాంక్​ తెలిపింది.