హైదరాబాద్ వెదర్ షాక్ : 40 ఏళ్ల తర్వాత.. అర్థరాత్రి 20 డిగ్రీలు

హైదరాబాద్ వెదర్ షాక్ : 40 ఏళ్ల తర్వాత.. అర్థరాత్రి 20 డిగ్రీలు

హైదరాబాద్ అంటే కూల్ వెదర్.. మిగతా ప్రాంతాల్లో  రాత్రి పూట ఉండే ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్ లో ఉదయం ఉంటాయి.. అంత చల్లగా ఉంటుంది.. ఎంతో ఆహ్లాదరకంగా ఉంటుంది. చలికాలంలో రాత్రి సమయంలో బయటకు రావాలంటేనే వణుకు పడుతుంది.. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్ వాతావరణం పూర్తిగా మారిపోయింది.. అది కూడా చలికాలంలో.. జనవరి నెలలో.. హైదరాబాద్ లో అర్థరాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదైంది.. వాతావరణంలో మార్పులకు ఇది సంకేతం.. గ్లోబల్ వార్మింగ్ కు ఇది నిదర్శనం అంటున్నారు పర్యావరణ నిపుణులు.. జనవరి నెలలో రాత్రి సమయంలో.. ఫ్యాన్ వేసుకోవాల్సినంత వేడి ఉండటం ఇప్పుడు.. హైదరాబాదీలకు కంగారు పుట్టిస్తుంది.. హైదరాబాద్ వాతావరణంపై ఆందోళన వ్యక్తం అవుతుంది.

చలికాలంలో అత్యంత  వేడిగా ఉన్న   జనవరి నెల ఇదేనని  భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్  వెల్లడించింది. జనవరి 12 శుక్రవారం రాత్రిపూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కు  చేరుకున్నాయి.  హైదరాబాద్ లో 1981 నుండి నమోదైన గరిష్ట రాత్రి ఉష్ణోగ్రత కంటే ఒక డిగ్రీ ఎక్కువగా ఉంది.   గత 40 సంవత్సరాలలో అత్యంత వెచ్చని జనవరి  ఇదేనని  చెబుతున్నారు. 

మరో వైపు హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. జనవరి 12 శుక్రవారం మధ్యాహ్నం ఉష్ణోగ్రత 30.7 డిగ్రీలకు చేరుకుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది సాధారణ సగటు కంటే సుమారు 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ.

గత 30 ఏళ్ల హైదరాబాద్ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. జనవరి మొదటి రెండు వారాలలో హైదరాబాద్‌లో సగటు పగటి ఉష్ణోగ్రత సాధారణంగా 28°C ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సగటున దాదాపుగా 15.9°C గా ఉంటున్నాయి. 

రాబోయే రోజుల్లో మరింత పెరగనున్న ఎండలు

రాబోయే మూడు రోజులలో హైదరాబాద్‌లో ఎటువంటి వర్షపాతం ఉండదని వాతావరణ శాఖ అంచనా వేసింది.  హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యే అవకాశం ఉండగా.. కనిష్ట ఉష్ణోగ్రత 18- 20 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే  రోజులు, హైదరాబాద్‌లో శీతాకాలం సీజన్‌లో వేసవిని తలపించే అవకాశం ఉంటుంది.