- ‘స్టార్మ్ వాటర్’, ‘బ్లూ- గ్రీన్’ మాస్టర్ ప్లాన్ల అమలు
- నలువైపులా ఫ్లైఓవర్లు, రహదారులతో బెస్ట్ నెట్వర్క్
- రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఉప ముఖ్యమంత్రి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలతో ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. కేవలం రెండేళ్ల స్వల్ప కాలంలోనే నగరాభివృద్ధి కోసం రూ.20 వేల కోట్లు కేటాయించామని, రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం హైటెక్స్‌లో నిర్వహించిన ‘క్రెడాయ్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షో’ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాలతోనే కాకుండా, పెట్టుబడులు, ప్రతిభ, జీవన నాణ్యతలో ప్రపంచంలోని మేటి నగరాలతో పోటీ పడుతోందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వరదల నియంత్రణకు సమగ్ర ‘స్టార్మ్ వాటర్ మాస్టర్ ప్లాన్’, పర్యావరణ హితం కోసం ‘బ్లూ-గ్రీన్ మాస్టర్ ప్లాన్’ సిద్ధం చేస్తున్నామన్నారు. నగరం అంటే కేవలం కాంక్రీట్ కట్టడాలే కాదని, ప్రజలకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు ప్రభుత్వం అందించే సేవలపైనే నగర గొప్పతనం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ఒక సాహసోపేతమైన, చారిత్రాత్మక నిర్ణయమని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. ఈ నిర్ణయంతో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతమంతా ఒకే విధమైన పౌర సేవలు, సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చెందుతుందని వివరించారు. నిధుల కేటాయింపులో జలమండలికి రూ. 12,500 కోట్లు, హెచ్ఎండీఏకు రూ. 4,336 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ. 1,950 కోట్లు వెచ్చించి మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నట్లు వివరించారు.
రూ. 7,032 కోట్లతో మౌలిక సదుపాయాలు
నగర ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ‘హెచ్-సిటీ’ కార్యక్రమం కింద రూ. 7,032 కోట్లతో భారీ ప్రాజెక్టులు చేపట్టినట్లు భట్టి తెలిపారు. ఇందులో భాగంగా 45 ప్రధాన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, 10 కీలక రోడ్డు విస్తరణ పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ. 1,090 కోట్లు, వెస్ట్ కారిడార్‌లోని ఐఐఐటీ, ఖాజాగూడ జంక్షన్ల వద్ద మల్టీలెవల్ ఫ్లైఓవర్ల కోసం రూ. 837 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే తూర్పున రూ. 416 కోట్లు, ఉత్తరాన ఆర్మీ ఏరియా రహదారుల కోసం రూ. 960 కోట్లు, దక్షిణాన రూ. 863 కోట్లతో రోడ్డు నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా 'క్యూర్–ప్యూర్ –రేర్' వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని, ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని డిప్యూటీ సీఎం అన్నారు.
మున్సిపల్ ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగంపై తమకున్న నిబద్ధతను చాటేందుకే తాను, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యామని భట్టి తెలిపారు. ఈ రంగంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. “మేం కేవలం రహదారులు నిర్మించడం లేదు. ప్రభుత్వంపై, వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకాన్ని పునర్నిర్మిస్తున్నాం” అని చెప్పారు.
