చలికాలం వచ్చిందంటే దేశరాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గటం.. అక్కడి ప్రజలు బయటకు రావటం కూడా కష్టతరంగా మారటం గడచిన కొన్నేళ్లుగా సర్వ సాధారణంగా మారిపోయింది. అయితే ఈ పరిస్థితుల వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది చిన్న పిల్లలు, వృద్ధులని తెలుస్తోంది. అయితే ఈ సమస్య ప్రస్తుతం ఢిల్లీతో పాటు దేశంలోని మరిన్ని మెట్రో నగరాలకు కూడా పెద్ద విపత్తుగా మారిందని డేటా చెబుతోంది.
తాజా పాలసీ బజార్ డేటా ప్రకారం వాయు కాలుష్యం కారణంగా అనారోగ్యానికి గురవుతూ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఢిల్లీలో పెరిగిపోయాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారంగా నిలిచిందని వెల్లడైంది. 2022-25 మధ్య కాలంలో దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో పొల్యూషన్ వల్ల అనారోగ్య క్లెయిమ్స్ 4 లక్షలుగా ఉన్నట్లు తేలింది. మెుత్తం క్లెయిమ్స్ లో 43 శాతం 10 ఏళ్ల లోపు పిల్లలకు సంబంధించినవిగా వెల్లడైంది. ఇక 30-40 ఏళ్ల మధ్య వయస్కుల క్లెయిమ్స్ 14 శాతం, 60 ఏళ్లు పైబడిన వారి క్లెయిమ్స్ 7 శాతంగా ఉన్నట్లు తేలింది.
పొల్యూషన్ కారణంగా అనారోగ్యంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో మెుదటి స్థానంలో ఢిల్లీ ఉండగా.. రెండవ స్థానంలో హైదరాబాద్ నగరం నిలవటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. నగరం విస్తరణతో పాటే సమస్యలూ పెరుగుతున్నాయని.. ఇది గాలి నాణ్యతను కూడా తగ్గిస్తోందని చాలా మంది అంటున్నారు. ఇక ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్న నగరాల జాబితాలో బెంగళూరు మూడో స్థానాన్ని దక్కించుకుంది. తర్వాతి స్థానాల్లో పూణే, ముంబై నిలిచాయి.
రోజురోజుకూ పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఈ నగరాల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎక్కువగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), అరిథ్మియా, హైపర్‌టెన్షన్, ఎగ్జిమా, కండ్లకలక, గర్భధారణ సమస్యలు, అలెర్జీలు,సైనసిటిస్‌లకు సంబంధించినవిగా వెల్లడైంది. సగటు క్లెయిమ్ మెుత్తం రూ.55వేల కంటే ఎక్కువగా ఉండగా.. రోజుకు సగటు హాస్పిటల్ బిల్స్ రూ.19వేల వద్ద ఉన్నట్లు తేలింది. ఎయిర్ పొల్యూషన్ సమస్యలకు ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండాల్సి రావటం వారికి ఆక్సిజన్ థెరపీ, నెబ్యులైజేషన్ వంటి చికిత్సలు అవసరం కావటం వల్ల ఈ వ్యాధులకు వైద్యం కొంత ఖరీదుగా మారినట్లు నిపుణులు చెబుతున్నారు.
