
అమెరికాలో తెలుగు స్టూడెంట్ ను కాల్చి చంపాడు ఓ దుర్మార్గుడు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సిటీకి చెందిన 28 ఏళ్ల పోలే చంద్రశేఖర్ టెక్సాస్ సిటీలోని ఓ గ్యాస్ స్టేషన్ లో పని చేస్తున్నాడు. ఆ సమయంలో గ్యాస్ స్టేషన్ కు.. గ్యాస్ కోసం వచ్చిన ఓ నల్ల జాతీయుడు.. చంద్రశేఖర్ పై తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. చంద్రశేఖర్ స్పాట్ లోనే చనిపోయినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన 2025, అక్టోబర్ 4వ తేదీ తెల్లవారుజామున జరిగినట్లు సమాచారం.
అమెరికాలో హత్యకు గురైన పోలే చంద్రశేఖర్ ఫ్యామిలీ.. హైదరాబాద్ సిటీ బీఎన్ రెడ్డి ఫేస్ 2 లోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్నారు. కుమారుడి మరణ వార్త విని షాక్ లో ఉన్నారు పేరంట్స్, కుటుంబ సభ్యులు. రెండేళ్ల క్రితం డెంటల్ సర్జరీ పీజీ కోసం F1 వీసాపై అమెరికా వెళ్లాడు చంద్రశేఖర్. చదువుకుంటూనే.. మరో వైపు గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. గ్యాస్ స్టేషన్ లో పని చేస్తున్న సమయంలోనే.. అక్కడికి వచ్చిన నల్ల జాతీయుడి చేతిలో చనిపోయాడు చంద్రశేఖర్.
పోలే చంద్రశేఖర్ డెడ్ బాడీని అమెరికా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు.. అక్కడి తెలుగు అసోసియేషన్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏడాది కాలంగా అమెరికాలో పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేవు. ఇటీవలే ఓ మోటల్ లో పని చేస్తున్న కర్నాటక వ్యక్తిని తల నరికి చంపారు.. ఈ ఘటన జరిగిన రెండు వారాల్లోనే తెలుగు స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. ఇప్పటికే అమెరికాలోని ఎన్నారైలు వీసా ఇష్యూస్, జాబ్ క్రైసస్ తో ఇబ్బంది పడుతున్నారు. ట్రంప్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు, నిబంధనలు మన తెలుగోళ్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇదే సమయంలో జాత్యాహంకార హత్యలు సైతం కలవరానికి గురి చేస్తున్నాయి.