
- క్లీన్ చేస్తేనే సమస్యకు పరిష్కారం
- ఇప్పటికే పనులు షురూ
- ప్రతి నాలాలో టన్నుల ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు
- అన్ని నాలాలను జీరో లెవెల్లో శుభ్రం చేయాలని టార్గెట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో 745 ప్రాంతాల్లో వరద ముప్పు ఉన్నట్లు హైడ్రా గుర్తించింది. ఈ ప్రాంతాల్లోని నాలాల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోవడం, ఆక్రమణలకు గురవడం వల్ల వర్షాలు కురిసినప్పుడు నాలాల్లో వెళ్లాల్సిన నీరు కాలనీల్లోకి చేరుతోంది. చాలా నాలాలు కుచించుకుపోవడంతో వరద పారే మార్గం లేక వర్షం పడితే లోతట్టు బస్తీలు, కాలనీలు జలమయమవుతున్నాయి. ఇటీవల వర్షాలకు అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, కృష్ణానగర్ తో పాటు పలు ప్రాంతాలు నదుల్లా మారడానికి కూడా కారణం ఇదే అని హైడ్రా తేల్చింది.
దీనికి నాలాలు క్లీన్ చేయడం, అవసరమైన ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించడమే పరిష్కారంగా భావించి ఇప్పటికే ఆ పనులను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు నాలాలను క్లీన్‌చేస్తుండగా చెత్తతో పాటు భారీగా చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయి. అలాగే, ఖైరతాబాద్ శ్రీధర్ ఫంక్షన్ హాల్ వద్ద బుల్కాపూర్ నాలా ఆక్రమణలు తొలగించింది. మూసాపేటలో నాలాలను కబ్జా చేసి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చేసింది. నల్లగండ్లలో ఎస్ఎన్ డీపీ ద్వారా నాలా కట్టడానికి అడ్డుగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించింది.
టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు..
గత నెల ఒకటో తేదీ నుంచి హైడ్రా ఆధ్వర్యంలో 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లు, 51 హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు కలిసి నాలాలు, కల్వర్టుల వద్ద పూడిక తీస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త బయటపడుతోంది. యూసుఫ్ గూడ పరిసరాల్లోని మధురానగర్, కృష్ణానగర్ వద్ద, గచ్చిబౌలి జనార్దన్ రెడ్డి నగర్ లోని నాలాల్లో, కాప్రా సర్కిల్ వార్డులోని మార్కండేయ కాలనీలో నాలా క్యాచ్ పిట్ ఏరియాలో, ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో ఆర్సీఐ రోడ్డు, మిథిలానగర్ దగ్గర మంత్రాల చెరువు నుంచి జిల్లెలగూడ చెరువునకు వెళ్లే నాలాలో, బుల్కాపూర్ నాలాల్లో నుంచి భారీగా వ్యర్థాలను తొలగించారు.
ఇదే నాలాకి సంబంధించి టోలీచౌకి సమీపంలోని విరాట్‌నగర్ వద్ద100 మీటర్ల పరిధిలో 50 లారీల వ్యర్థాలు బయటపడడం చూస్తే నాలాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద కూడా నాలా కల్వర్టులో భారీగా వ్యర్థాలను హైడ్రా తొలగించింది. చిన్న జేసీబీలు కాకుండా లాంగ్ ఆర్జేసీబీలను వినియోగించి చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.
అవగాహన లేమి.. నిర్లక్ష్యం
నగరంలో చెత్త సమస్య పరిష్కారానికి బల్దియా అనేక చర్యలు తీసుకుంటోంది. ఇంటింటికీ చెత్త ఆటోలను పంపించి సేకరిస్తోంది. ఆటోలు వెళ్లలేని చోట్ల డంపింగ్పాయింట్స్ఏర్పాటు చేసింది. అయితే, నాలాల సమీపంలో నివాసం ఉంటున్న కొంతమంది జనాలు, బద్దకస్తులు చెత్తను ఆటోలకు ఇవ్వకుండా నాలాల్లో పడేస్తున్నారు. మరికొందరు రాత్రి వేళల్లో చెత్తను తీసుకువచ్చి నాలాల్లో డంప్ చేస్తున్నారు. ప్లాస్టిక్వ్యర్థాలతో పాటు రోజువారీ చెత్త వేయడానికి నాలాలను ఉపయోగించుకుంటున్నారు. ఇలా ప్రతిరోజూ చేస్తుండడంతో వరద ప్రవాహానికి చెత్త అడ్డం పడుతోంది. దీంతో వర్షపు నీరు నాలాల్లోకి వెళ్లకుండా ఓవర్‌ఫ్లో అయి ఇండ్లు, కాలనీల్లోకి చేరుతోంది. దీంతో భారీ వర్షం పడితే అవన్నీ మునిగిపోతున్నాయి.
ఈసమస్యను పరిష్కరించేందుకే హైడ్రా నాలాల క్లీనింగ్కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని ఇక్కడితో వదిలేయకుండా అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోంది. హైడ్రా కమిషనర్రంగనాథ్ఆధ్వర్యంలో ‘బస్తీతో దోస్తీ’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు, సోషల్ యాక్టివిస్టులతో పాటు ప్రజలతో సమావేశాలు నిర్వహించి నాలాలు, చెరువుల ఆక్రమణలు తదితర అంశాలపై అవేర్నెస్కల్పిస్తున్నారు. నాలాలు ఆక్రమించడం, చెత్త వేయడం వల్ల వరద వెళ్లలేక కాలనీల్లోకి నీరు ఎలా చేరుతుందో వివరిస్తున్నారు.