మా వాడిపై ఆశలు వదులుకున్నాం..

V6 Velugu Posted on Jun 02, 2021

  • పీడకలలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం
  • మళ్లీ మా అబ్బాయిని మళ్లీ చూస్తామనుకోలేదు 
  • పాకిస్తాన్ జైలు నుండి తమ కొడుకు ప్రశాంత్ తిరిగొచ్చిన సందర్బంగా తండ్రి బాబురావు

విశాఖపట్టణం: పాకిస్తాన్ జైలు నుంచి తమ కొడుకు ప్రశాంత్ తిరిగి రావడం ఆశ్చర్యంగా.. సంబరంగా ఉందని అతని తండ్రి బాబురావు పేర్కొన్నారు. 2019లో పాకిస్తాన్ బోర్డర్ లో దారితప్పి పాక్ జైళ్లలో మగ్గిపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ కథ క్షేమంగా ముగిసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్ తల్లిదండ్రులు విశాఖపట్టణంలో నివసిస్తున్నారు. తమ కుమారుడు విశాఖలోని సొంత ఇంటికి తిరిగొచ్చిన సందర్భంగా మీడియా వారితో మాట్లాడారు. 
తమ కొడుకు ప్రశాంత్ తిరిగి రావడం నమ్మశక్యంగా లేదని.. దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టే తిరిగొచ్చినట్లు భావిస్తున్నానన్నారు. తమ కొడుకు పాక్ జైళ్లలో ఉన్నాడన్న విషయం తెలిసిన తర్వాత చాలా బాధ కలిగిందని.. మానసికంగా వర్ణించలేనంతగా నలిగిపోయామన్నారు. రాత్రయితే చాలు పీడకలలు వచ్చి భయపడేవారమని.. మళ్లీ మా వాడిని చూస్తామనుకోలేదని కంటతడిపెట్టుకున్నారు. అయితే తమ అబ్బాయిని తిరిగి రప్పించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సహాయత స్వచ్ఛంద సంస్థ వారు చాలా కృషి చేశారని.. వారు చేసిన మేలు జన్మలో మరచిపోలేనన్నారు. రోజూ పరిస్థితిని ఆరా తీస్తే.. రొటీన్ సమాధానాలే వస్తుంటే భయంతో ఏడ్పు వచ్చేదని.. ఎన్నోసార్లు వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఇరుగు పొరుగు అపార్టుమెంట్ల వారు ధైర్యం చెప్పి ఓదార్చారని గుర్తు చేసుకున్నారు. తమ కుమారుడిని విడిపించడానికి విశేష కృషి చేసిన ప్రభుత్వాలతోపాటు, సహాయత స్వచ్చంద సంస్థ, ముఖ్యంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు బాబురావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 
మళ్లీ ఉద్యోగంలో చేరతా.. ఇక నుంచి కొత్త జీవితం ప్రారంభిస్తా: ప్రశాంత్
పాక్ చెర నుంచి సురక్షితంగా సొంతింటికి చేరుకున్న ప్రశాంత్ తల్లిదండ్రులను చూసి కంటతడిపెట్టుకున్నాడు. మళ్లీ మిమ్మల్ని చూస్తాననుకోలేదని, ఆ దేవుని దయ ఉంది కాబట్టే బయటపడగలిగానన్నారు. పాకిస్తాన్ జైలులో తనకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని, తన లాంటి వారు మన దేశానికి చెందిన వారు ఇంకా చాలా మంది పాకిస్తాన్ లోని జైళ్లలో మగ్గిపోతున్నారని.. వారిని కూడా విడిపించాలంటూ ప్రభుత్వాలను కోరానన్నారు. పాక్ జైళ్లలో ఉంటున్న భారతీయుల వివరాలు తాను సేకరించిన వాటిని భారత ప్రభుత్వానికి అందజేశానని చెప్పారు. జైలు జీవితం తన జీవితాన్ని సమూలంగా మార్చేసిందని, భారత ఖైదీలతో పనిచేయించరు కాబట్టి తాను పుస్తకాలు చదువుతూ గడిపానన్నారు. త్వరలోనే ఉద్యోగంలో చేరి కొత్త జీవితాన్ని మొదలుపెడతానని. తాను పడిన కష్టాలు మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నానని చెప్పాడు. 


 

Tagged , hyderabad techie prashanth, prasanth father emotional, prasanth return to home, prasanth from pakistan jail

Latest Videos

Subscribe Now

More News