ఎక్కడా చిన్న లోపం రావద్దు

ఎక్కడా చిన్న లోపం రావద్దు
  • మిస్​ వరల్డ్‌ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీస్కోవాలి
  • అతిథులు ఉండే హోటళ్ల వద్ద భద్రతను పెంచండి
  • పోటీల నిర్వహణపై రివ్యూలో సీఎం ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: మిస్‌‌ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీస్కోవాలని, ఎక్కడా చిన్న లోపం కూడా లేకుండా ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ గొప్పదనం విశ్వవ్యాప్తం చేసేలా వేడుకలను నిర్వహించాలన్నారు. వివిధ దేశాల నుంచి పోటీలకు వచ్చే అతిథులను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలన్నారు. మే 10 నుంచి 31 వరకు జరిగే కార్యక్రమాల షెడ్యూల్​కు అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

 విదేశీ అతిథులు బస చేసే హోటళ్లతో పాటు గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమొహల్లా ప్యాలెస్, సెక్రెటేరియెట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచాలని ఆదేశించారు. మిస్​ వరల్డ్​ పోటీల ఏర్పాట్లపై సోమవారం ఆయన కమాండ్​ కంట్రోల్​ సెంటర్‌‌‌‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​ రెడ్డి, సీఎస్​ రామకృష్ణారావు, స్పెషల్‌‌ సీఎస్‌‌ జయేశ్‌‌ రంజన్, డీజీపీ జితేందర్, సిటీ పోలీస్ కమిషనర్​ సీవీ ఆనంద్, రాచకొండ కమిషనర్‌‌‌‌ జి.సుధీర్​బాబు, ఏడీజీపీ స్టీఫెన్‌‌ రవీంద్ర తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. పర్యాటక శాఖతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్​ రెడ్డి ఈ సందర్భంగా ఆదేశాలిచ్చారు.

పోటీల్లో భాగంగా నిర్వహించే ప్రతి ఈవెంట్‌‌కు ఒక నోడల్‌‌ ఆఫీసర్‌‌‌‌ను నియమించాలని సూచించారు. హైదరాబాద్‌‌లోని చార్మినార్​, లాడ్ బజార్‌‌‌‌తో పాటు తెలంగాణ తల్లి విగ్రహం, సెక్రటేరియెట్‌‌తో పాటు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్  పోటీదారులు సందర్శించనున్నందున వారికి అవసరమైన రవాణా వసతులు కల్పించాలన్నారు. ఆయాచోట్ల భద్రతను పెంచాలని, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు.

ఐపీఎల్‌‌ సెమీఫైనల్స్‌‌ చూసేలా ఏర్పాట్లు చేయండి

రాష్ట్రంలో మహిళా సాధికారతను చాటేలా ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్‌‌‌‌ సందర్శనతో పాటు, ఉప్పల్​ స్టేడియంలో ఐపీఎల్​ సెమీఫైనల్స్​ను మిస్​ వరల్డ్​ కంటెస్టెంట్లు చూసేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్​ ఆదేశించారు. మిస్​ వరల్డ్​ పోటీలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఇబ్బందులు, కరెంట్​ అంతరాయాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేసుకోవాలని, ఈదురుగాలులు, వర్షాలు వచ్చినా ఇబ్బందులు లేకుండా జీహెచ్​ఎంసీ, హైడ్రా విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. 

వేడుకలు జరిగే రోజుల్లో హైదరాబాద్ అంతటా మిస్ వరల్డ్ సందడి కనిపించేలా తోరణాలు, లైటింగ్, హోర్డింగ్‌‌లతో పాటు సిటీలోని ముఖ్యమైన జంక్షన్లు, చారిత్రక ప్రదేశాలను అందంగా అలంకరించాలని సూచించారు. పోటీదారులతో పాటు దాదాపు 3 వేల మంది ఇంటర్నేషనల్​ మీడియా ప్రతినిధులు ఈవెంట్‌‌కు హాజరవుతారని చెప్పారు. ప్రజాప్రతినిధులతో పాటు వివిధ రంగాల ప్రముఖులను ప్రభుత్వం తరఫున మిస్​వరల్డ్​ పోటీల ప్రారంభోత్సవానికి ఆహ్వానించాల్సిందిగా సీఎం ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ గురుకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్​ స్కూళ్లు, మోడల్​ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ స్కూళ్ల విద్యార్థులకు ఒకరోజు వేడుకలను చూపించాలని సూచించారు. అందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు.