- మొత్తం 224 కిలోమీటర్ల విస్తరణకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 151 కిలో మీటర్ల మేర రోడ్డు విస్తరణ
- ఇప్పటికే భూసేకరణకు ఆఫీసర్ల నియామకం
- రూ. 10 వేల కోట్లతో ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న హైదరాబాద్ -విజయవాడ సిక్స్ లైన్ విస్తరణ పనులు
నల్గొండ, వెలుగు: హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే పనులు స్పీడందుకున్నాయి. ఈ మార్గం త్వరలోనే సిక్స్ లేన్ గా మార్చేందుకు కేంద్రం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధం చేయగా ఈనెల రెండో వారంలో ఈ డీపీఆర్‌ను ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ (పీఏటీఎస్‌సీ) ముందు అధికారులు ప్రవేశపెట్టనున్నారు.
డీపీఆర్‌లో నాలుగు ఆప్షన్లు
ఈ డీపీఆర్‌లో నాలుగు వేర్వేరు ఆప్షన్లు రూపొందించారు. అందులో మొదటి ఆప్షన్ ప్రకారం మొత్తం 231.32 కిలోమీటర్ల మేర హైవేను విస్తరించనున్నారు. తెలంగాణ పరిధిలో ఉన్న హైవేను ఫోర్ లేన్ నుంచి సిక్స్ లేన్ గా మారుస్తారు. అందులో 209 కిలోమీటర్ల బ్రౌన్ ఫీల్డ్, 22.25 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ఉండనుంది. మొత్తం హైవే లో నాలుగు ఫ్లై ఓవర్లు, చిన్నా పెద్ద కలిపి 60 వెహికిల్ అండర్‌పాస్‌లు, జంతువులు రహదారి దాటడానికి ప్రత్యేకంగా 10 అండర్ పాస్‌లు నిర్మించనున్నారు.
భూసేకరణకు ఆఫీసర్ల నియామకం
హైదరాబాద్ - విజయవాడ హైవే విస్తరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం ఇందుకు సంబంధించి భూసేకరణ కోసం ఆఫీసర్లను నియమిస్తూ ఇటీవల ఆర్డర్స్ జారీ చేసింది. భూసేకరణ చేసే భాద్యత ఆర్డీవోలకు అప్పగించగా బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు, బైపాస్, రోడ్డు క్రాసింగ్ ల ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టేందుకు ఆర్డీవోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
4 నుంచి 6 లైన్స్ విస్తరణకు 182.41 హెక్టార్ల భూసేకరణ అవసరమని గుర్తించారు. యాదాద్రి జిల్లా మల్కాపూర్‌నుంచి ప్రారంభమై చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, నవాబుపేట, నందిగామ, కీసర, పరిటాల, ముళ్లపాడు, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి మీదుగా విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌వరకు విస్తరించనున్నారు. యాదాద్రి జిల్లా పరిధిలో మొత్తం 22 కిలోమీటర్ల హైవే ఉండగా ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మండలంలోని 9 గ్రామాల పరిధిలోని 12 ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టనున్నారు.
నల్గొండ జిల్లా పరిధిలో 65 కిలోమీటర్లు హైవే ఉండగా చిట్యాల మండలంలో 5, నార్కట్ పల్లి మండలంలో 5, కట్టంగూరు 4, నకిరేకల్ 2, కేతేపల్లి 4 గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో 64 కిలోమీటర్లు ఉండగా సూర్యాపేట మండలంలో 4, చివ్వెంలలో 6, కోదాడలో 4, మునగాలలో 5 గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నారు.
రూ.10 వేల కోట్లతో ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న హైవే పనులు
ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్ల భారీ వ్యయం అంచనా వేసింది. 2026–-27లో పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పీఏటీఎస్‌సీ కమిటీ ఆమోదం అనంతరం నివేదికను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ ఎప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ముందు ఉంచుతారు. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత కేంద్ర కేబినెట్‌ఆర్థిక వ్యవహారాల కమిటీ ముందు తుది ఆమోదం పొందనుంది. దాంతో ఎన్‌హెచ్‌ఏఐ టెండర్ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది. ఈ దశకు మరో రెండు, మూడు నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే, 2026–-27 సంవత్సరంలో ఈ భారీ రహదారి విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి.
