
- 50 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ
- భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ స్థలాలు, ఇన్స్టిట్యూషన్లలో ఏర్పాటు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్‌పరిధిలో నీటి సమస్య పరిష్కారానికి వాటర్‌బోర్డు అధికారులు ‘ఇంకుడు గుంతల జలయజ్ఞం–2025’ పేరుతో 50 రోజుల స్పెషల్ప్లాన్కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న 90 రోజుల కార్యక్రమంలో ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకునేలా చేస్తున్నారు. వచ్చే వారం నుంచి అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్థలాలు, ఇన్స్టిట్యూషన్స్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయనున్నారు.
ఎంత వర్షం పడతున్నా..
నగరంలో అధిక వర్షపాతం నమోదవుతున్నా భూగర్భ జలాలు మాత్రం పెరగడం లేదు. దీనికి కారణం ఇంకుడు గుంతలు లేకపోవడమే. కమర్షియల్కాంప్లెక్స్‌లు పెరుగుతుండడం, నగరమంతా కాంక్రీట్‌మయం అవుతుండడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వర్షపు నీరంతా వరద రూపంలో నాలాల్లో కలిసి మూసీలో చేరుతోంది. ఈ నీళ్లను ఒడిసిపట్టాలని సంకల్పించిన వాటర్‌బోర్డు వచ్చే వారం నుంచి సెప్టెంబర్ 30 వరకు నాలుగు రకాల ‘గ్రౌండ్ వాటర్ రీచార్జి ’ ప్లాన్అమలు చేసేందుకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా ప్రభుత్వ స్థలాలు, వివిధశాఖల ఆవరణలు, విద్యాసంస్థలు, రోడ్డుపక్కన స్థలాలు, ఇన్స్టిట్యూషన్ల ప్రాంగణాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తారు. వాణిజ్య సముదాయాల్లో రూఫ్ టాప్ నుంచి కిందికి పడే వర్షపు నీటిని పైపుల ద్వారా తరలించి ప్రజా ఇంకుడు గుంతలు నిర్మిస్తారు. ఇలా16 వేల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని వాటర్‌బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, నిరుపయోగంగా ఉన్న బోరు బావులను హార్వెస్టింగ్ పిట్లతో ఇంజక్షన్ బోర్‌వెల్‌గా మార్చాలని నిర్ణయించింది.
ఇప్పటికే 3,222 బోర్ వెల్స్ నిరుపయోగంగా ఉన్నాయని గుర్తించింది. ఇందులో పవర్ బోర్‌వెల్స్ 1,045 ఉండగా, కోర్ సిటీ పరిధిలో 246, శివారు పరిధిలో 7,99 బోర్లున్నాయి. హ్యాండ్ బోర్‌వెల్స్ 2,177 ఉండగా కోర్‌సిటీలో 1,665, శివార్లలో 1,557 ఉన్నాయి. ఇవే కాకుండా ఔటర్‌రింగ్ రోడ్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్థుల భవన సముదాయాల్లో కమ్యూనిటీ ఇంకుడు గంతలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షణ..
ప్రభుత్వ స్థలాలు, బహిరంగ స్థలాల్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను జీఐఎస్ మ్యాపింగ్‌తో డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే గుర్తించిన ప్రజా ఇంకుడు గుంతల ప్రాంతాలను జియో ట్యాగ్ చేస్తారు. నిర్మాణం ముందు, నిర్మాణం తర్వాత తీసిన ఫొటోలను అప్లోడ్ చేసే వీలుగా ఐటీ విభాగం ప్రత్యేక మొబైల్ యాప్ కు రూపకల్పన చేస్తోంది. ప్రజా ఇంకుడు గుంతల నిర్మాణ పురోగతిని తెలుసుకునే విధంగా యాప్ అనుసంధానంతో ప్రత్యేకమైన డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసి హెడ్డాఫీసు నుంచి పర్యవేక్షించనున్నారు.