ఒకే ఒక్క క్లిక్.. రూ.1.59 కోట్లు పోగొట్టుకుంది

ఒకే ఒక్క క్లిక్.. రూ.1.59 కోట్లు పోగొట్టుకుంది

పెరుగుతున్న టెక్నాలజీతోపాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి.. సైబర్ ఫ్రాడ్స్టర్స్  రోజుకో విధంగా ప్రజలు దోచుకుంటున్నారు.  లేటెస్ట్ టెక్నాలజీ ని వినియోగించుకొని.. కోట్లు దండుకుంటున్నారు..టెక్నాలజీపై అవగాహన ఉన్నా.. లేకున్నా..సైబర్ నేరగాళ్లు బారిన పడుతూనే ఉన్నారు ప్రజలు. సైబర్ నేరాల నియంత్రణలో పోలీస్ యంత్రాంగం, అటు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. రోజుకో తీరున దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు.. ఇటీవల ఓ మహిళ నుంచి 1.59కోట్లు దోచుకున్న కొరియర్ స్కాం ను బయటపెట్టారు రాచకొండ సైబర్ క్రైమ బ్రాంచ్ పోలీసులు.. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది..ఇటీవల కాలంలో ఆమె భర్త చనిపోవడంతో ఎల్ ఐసీ, ఇతర బీమాలకు సంబంధించి పెద్ద మొత్తంలో డిపాజిట్లు వచ్చాయి. అదే ఆమె కు శాపమైంది. సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ అధికారులమని చెప్పి..మభ్యపెట్టి, భయపెట్టి ఆమెనుంచి డిపాజిట్లను వారి ఖాతాల్లోకి మళ్లించుకున్నారు కేటుగాళ్లు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. 2023 ఆగస్ట్ లో బాధితురాలికి ఓ కొరియర్ కంపెనీనుంచి కాల్ వచ్చింది. తన పేరుతో అక్రమ డ్రగ్స్ ఉన్న పార్శిల్ రవాణ చేయబడిందని... ముంబై నుంచి తైవాన్ కు పంపుతుండగా పట్టుబడిందని ఫోన్ లో తెలిపారు. అయితే డ్రగ్స్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని బాధితురాలు చెప్పింది. ఇంతలో మరో కాల్ ముంబై పోలీస్ అధికారనని చెప్పి మరో వ్యక్తి బాధితురాలి భయపెట్టాడు. స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అవుతావు..ముందస్తు బెయిల్ పొందేందుకు కొంత అమౌంట్ తన ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేయాలని డిమాండ్ చేశాడు. తనను తాను రక్షించుకునే మార్గం లేక బాధితురాలు కేటుగాళ్లు సూచించిన ఖాతాలకు రూ. 1.59కోట్లు బదిలీ చేసింది. 

ఈ కేసు 2023 ఆగస్టులో రాచకొండ సైబర్ క్రైమ్ విభాగంలో నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగదు బదిలీ చేసిన ఖాతాదారుడు గుజరాత్ కు  చెందినవాడిగా గుర్తించి, కమిషన్ ప్రాతిపదికన బ్యాంకు ఖాతాను సైబర్ నేరగాళ్లకు ఇచ్చి అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

కోర్టు విచారణ అనంతరం రూ. 20 లక్షల మొత్తాన్ని బాధితురాలికి తిరిగి ఇచ్చినట్లు రాచకొండ పోలీస్ అధికారి తెలిపారు.