
హైదరాబాద్: కొన్ని రోజుల క్రితం నగరంలోని జూపార్క్ ప్రాంతంలో జరిగిన మర్డర్ మిస్టరీని సౌత్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. మృతుడి స్నేహితులే అతన్ని అతి దారుణంగా చంపి, తగులబెట్టారని విచారణలో తేలింది. ఈ నెల 1న పాతబస్తీ బహదూర్ పురా పీఎస్ పరిధిలో వసీం అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతనిపై రాయితో దాడి చేసి, చంపారన్నఅనవాళ్లు లభించడంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం హంతకుల కోసం గాలించింది.
దర్యాప్తులో మృతుడి స్నేహితులు మిస్రి గంజ్ కి చెందిన మహమ్మద్ ఆసిఫ్, కాలాపత్తర్ కి చెందిన సల్మాన్ ఖాన్ లను ఇద్దరినీ అదుపులొకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. మద్యం తాగే సమయంలో వీరి మధ్య ఘర్షణ జరగడంతో వసీంను హత్య చేసినట్లు నిందితులు తెలిపారు. వారిద్దిరినీ తదుపరి విచారణ కొరకు స్థానిక బహదూర్ పురా పోలీసులకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు.