వదిలేసి పొండి చాలు.. మెషీన్లే పార్క్ చేస్కుంటయ్

వదిలేసి పొండి చాలు.. మెషీన్లే పార్క్ చేస్కుంటయ్
  • నాంపల్లిలో ఆటోమేటిక్​ పజిల్​ పార్కింగ్​ రెడీ
  • ఒకటే బిల్డింగ్​లో 250 కార్లు, 200 బైక్స్​ పార్క్​ చేసుకోవచ్చు 
  • 15 అంతస్తుల కాంప్లెక్సులో10 ఫ్లోర్లు పార్కింగ్​కే
  • మిగిలిన వాటిలో థియేటర్లు, గ్యాలరీలు..
  • పరిశీలించిన మెట్రో ఎండీ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: పార్కింగ్ సమస్యలను పరిష్కరించేందుకు నాంపల్లిలో నిర్మిస్తున్న 15 అంతస్తుల అత్యాధునిక పజిల్ పార్కింగ్ బిల్డింగ్​కు తుది మెరుగులు దిద్దుతున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ బిల్డింగులో 250 కార్లు, 200 బైకులు ఈజీగా పార్క్​చేసుకోవచ్చు. పైగా, అక్కడ మనం కారు వదిలేసి పోతే చాలు సెన్సార్ల సాయంతో పని చేసే మెషీన్లు పార్క్​చేస్తాయి. ఈ ప్రాజెక్టును హెచ్‌‌ఎంఆర్‌‌ఎల్ ఆధ్వర్యంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్​నర్‌‌షిప్ విధానంలో ‘నోవమ్’ నిర్మిస్తున్నది. జర్మనీకి చెందిన ‘పాలిస్’ టెక్నాలజీతో పూర్తి ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ వ్యవస్థగా ఇది రూపుదిద్దుకుంటోంది. 

పార్కింగ్.. కమర్షియల్ స్పేస్ 

2,000 చదరపు గజాల్లో15 అంతస్థులతో నిర్మించిన ఈ కాంప్లెక్స్‌‌లో మూడు బేస్​మెంట్లు, ఏడు పైఅంతస్తులతో కలిపి 10 పార్కింగ్ ఫ్లోర్లు ఉన్నాయి. మిగిలిన 5 అంతస్తుల్లో 2 లేటెస్ట్​సినిమా థియేటర్లు, గ్యాలరీ ఉంటాయి. ఇక్కడ కార్లను తీసుకువెళ్లి వదిలేస్తే సెన్సార్ల సాయంతో మనుషుల ప్రమేయం లేకుండానే మెషీన్లు తీసుకువెళ్లి ఆటోమేటిక్​గా పార్క్​చేస్తాయి. పైగా ఈ సెన్సార్లు ఎస్​యూవీ, సెడాన్​లు, చిన్న కార్లను వాటి సైజ్​ఆధారంగా గుర్తించి వేరు చేసి, ఎక్కడ పార్క్​చేయాలో అక్కడే పార్క్​ చేస్తాయి. వాహనాన్ని ఏ కోణంలో విడిచినా, 360 డిగ్రీలు తిరిగే ‘పాలిస్’ టర్న్‌‌టేబుల్ స్వయంగా సరైన స్థితిలో పెట్టి పార్క్ చేస్తుంది. 

ఎలా పని చేస్తుందంటే..

ఎంట్రన్స్ లో క్యూ ఆర్ కోడ్​తో కూడిన స్మార్ట్ కార్డ్ స్వైప్ చేస్తే టెర్మినల్ గేట్ తెరుచుకుంటుంది.  డ్రైవర్ తన వాహనాన్ని టర్న్‌‌ టేబుల్​పై నిలిపి, హ్యాండ్​బ్రేక్ వేసి, ఇంజిన్ ఆఫ్ చేసి బయటకు వస్తే సరిపోతుంది. కార్డును స్వైప్ చేయగానే సిస్టమ్ వాహనాన్ని స్కాన్ చేసి, ఎస్​యూవీలు, సెడాన్‌‌గా వర్గీకరించి కావాల్సిన చోట పార్క్​చేస్తుంది. ఫీజు పే చేసిన తర్వాత సూచించిన టెర్మినల్ వద్ద కార్డు స్వైప్ చేస్తే వాహనం అక్కడికే వస్తుంది.

తొందరలోనే అందుబాటులోకి..

తొందర్లోనే ఈ అత్యాధునిక, ప్రపంచంలోనే అరుదైన పూర్తి ఆటోమేటెడ్ పార్కింగ్ వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. తుది అనుమతులు రాగానే అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రపంచంలోనూ ఇటువంటి సౌకర్యాలు ఉన్న పార్కింగ్​సిస్టమ్​ అరుదు. వాహనాలు లోపలికి, బయటకు వచ్చే టెర్మినల్స్ విశాలంగా, స్మార్ట్‌‌గా రూపొందించాం. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు అనుకూలమైన ఫ్లాట్ టెర్మినల్స్ ఉన్నాయి. ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.