
హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ఎక్కడా తగ్గడం లేదు. అక్రమ నిర్మాణాలను కూల్చేసి హైదరాబాద్ ను భూములను పరిరక్షించడమే లక్ష్యంగా ఏర్పిడిన హైడ్రా.. అదే బాటలో యాక్షన్ కొనసాగిస్తోంది. బుధ, గురువారాల్లో (మే 21, 22) మేడిపల్లి పరిధిలో ఆక్రమణలు కూల్చేసిన హైడ్రా.. శుక్రవారం (మే 23) జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఆక్రమణలను కూల్చేసింది.
పెద్దమ్మగుడి పక్కన నాలాను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. ఉదయం ఆరు గంటల నుంచి కూల్చివేతలు కొనసాగాయి. నాలా పై నిర్మించిన నిర్మాణాలు, షెడ్లను కూల్చివేశారుఅధికారులు.
స్థానికుల ఫిర్యాదుతో సర్వే నిర్వహించిన అధికారులు.. నాలా ను ఆక్రమించి నిర్మించినట్లు గుర్తించారు. దీంతో గురువారం 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను కూల్చివేశారు.
అదేవిధంగా ప్రభుత్వానికి చెందిన 2 ఎకరాల నాలా, పార్కు స్థలం కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూల్చేశారు అధికారులు. సుమారు రూ.2 వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడామని ఈ సందర్భంగా హైడ్రా అధికారులు తెలిపారు. త్వరలో ఈ స్థలంలో పార్కు డెవలప్ చేస్తామన్న జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.