రాజేంద్రనగర్ వాలంతరి భూములపై.. హైడ్రా ఫోకస్

రాజేంద్రనగర్ వాలంతరి భూములపై.. హైడ్రా ఫోకస్
  • వీలైనంత త్వరగా కబ్జా నుంచి విడిపించేందుకు చర్యలు
  • ఆక్రమించిన వారంతా బడాబాబులే: కమిషనర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజేంద్రనగర్​లోని వాలంతరి, టీజీఈఆర్​ఎల్ భూములపై హైడ్రా దృష్టి సారించింది. కబ్జాకు గురైన ఇరిగేషన్​ భూములను వీలైనంత త్వరగా విడిపించేందుకు ఇరిగేషన్​శాఖ, హైడ్రా, రెవెన్యూ, ఆర్అండ్ఆర్(రిహబిలేషన్ అండ్ రీ సెటిల్ మెంట్)​ విభాగాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇదే విషయంపై గత నెల 31న ఇరిగేషన్, హైడ్రా, రెవెన్యూ డిపార్ట్​మెంట్ల అధికారులతో మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. 

ఈ సమావేశంలో గండిపేట, రాజేంద్రనగర్​లలోని వాలంతరి (వాటర్​అండ్​ల్యాండ్​ మేనేజ్​మెంట్​ట్రైనింగ్​అండ్​రీసెర్చ్​ఇనిస్టిట్యూట్), టీజీఈఆర్​ఎల్(తెలంగాణ గ్రౌండ్ వాటర్​అండ్​ఇరిగేషన్​రీసెర్చ్​లేబొరేటరీ)కు సంబంధించి 426.30 ఎకరాల్లో కబ్జాకు గురైన 131.31 ఎకరాల భూములను కాపాడాలని మంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హిమాయత్ సాగర్ లో ఆక్రమణలకు గురైన వాలంతరి భూములను పరిశీలించారు. 

హిమయాత్ సాగర్ డ్యామ్​పై నుంచి ఆక్రమణలను పరిశీలించారు. అలాగే కింది భాగంలో ఆక్రమించిన ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఆక్రమించి నిర్మించిన షెడ్లను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ఇదే అంశపై రంగనాథ్ వెలుగుతో మాట్లాడారు. ఆక్రమించిన వారంతా బడాబాబులే ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఇండ్లను నిర్మించుకొని నివాసం ఉంటున్న పేదలు భయాందోళనకు గురికావద్దన్నారు. పేదల ఇండ్ల వద్దకు హైడ్రా రాదని అన్నారు.  

వాలతంరి భూములను ఆక్రమణల నుంచి కాపాడే బాధ్యతను ప్రభుత్వం తమకు అప్పగించిందన్నారు. ఇందులో పేదలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

గండిపేట: మూసీ పరివాహక ప్రాంతాలను రంగనాథ్ పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో ప్రజలు నివాసం ఉండకుండా చూడాలన్నారు.