ఒక్క రోజే 30 వేల కోట్ల విలువైన.. 840 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా

ఒక్క రోజే 30 వేల కోట్ల విలువైన.. 840 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా

 

  • శంషాబాద్‌‌‌‌లో 650 ఎక‌‌‌‌రాలు, కంటోన్మెంట్‌‌‌‌లో 106 ఎక‌‌‌‌రాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్‌‌‌‌
  • రాయ‌‌‌‌దుర్గంలో 84 ఎక‌‌‌‌రాల ప్రభుత్వ భూమి స్వాధీనం
  • ఆయా జిల్లాల రెవెన్యూ అధికారుల రిక్వెస్ట్ మేరకు చర్యలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) శనివారం ఒక్కరోజే దాదాపు 840 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడింది. ఈ భూమి విలువ దాదాపు రూ.30 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనావేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్టు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌‌‌‌గూడ గ్రామంలో 650 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేస్తున్నది. 1954 ఖాస్రా పహాణీ ప్రకారం సర్వే నంబర్లు 25, 26 ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నప్పటికీ, కొందరు అక్రమంగా ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు నిర్మించి, వ్యవసాయం చేస్తూ.. భూమిని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

2002–2006లో అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఎంజాయ్‌‌‌‌మెంట్ సర్వే నిర్వహించి, భూముల ఆక్రమణలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చే ప్రయత్నం చేశారు. క్రమబద్ధీకరించే ప్రతిపాదనను ప్రభుత్వం వద్దకు పంపినా, 2006లో సీసీఎల్ ఏ తిరస్కరించింది. అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో భూముల కేటాయింపుపై నిషేధం ఉందని పేర్కొంది.  దీంతో క్రమబద్ధీకరణ అంశం పూర్తిగా ముగిసిన అంశంగా రికార్డుల‌‌‌‌కెక్కింది.  ప్రస్తుతం కూడా ప్రభుత్వం తమదిగా పేర్కొంటున్న భూముల్లో గ్రామ‌‌‌‌స్తుల‌‌‌‌తో పాటు ప‌‌‌‌లువురు ఫామ్ హౌస్‌‌‌‌లు క‌‌‌‌ట్టుకుని వ్యవ‌‌‌‌సాయం చేస్తున్నారు. ఈ మేర‌‌‌‌కు వారిని హైడ్రా ఖాళీ చేయించి..  శంషాబాద్ మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి కాపాడింది. ఈ ఫెన్సింగ్ పనులు రెండ్రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రభుత్వ భూములపై జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు, వన్యప్రాణుల సంరక్షణకు భంగం కలగకుండా చూడడమే ఈ ప్రత్యేక ఆపరేషన్ల ప్రధాన ఉద్దేశమని హైడ్రా అధికారులు వెల్లడించారు. 

కంటోన్మెంట్‌‌‌‌లో 106 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్

మేడ్చల్–మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో జీఎల్‌‌‌‌ఆర్ (జనరల్ ల్యాండ్ రిజిస్ట్రార్) నంబర్లు 243, 255లో నమోదైన 106 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్, లేఅవుట్లు, ఆక్రమణలతో పాటు వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ శాఖ అభ్యర్థన మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. కొండలను పేల్చడం వల్ల నెమళ్ల సంచారానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా చర్యలు తీసుకుంది. 

రాయదుర్గంలో 84 ఎకరాలు స్వాధీనం..

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామంలోని సర్వే నంబర్ 46లో ఉన్న 84 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. మ‌‌‌‌ల్కం చెరువు ఎదురుగా కొండ‌‌‌‌లు, గుట్టలు, ప‌‌‌‌చ్చని చెట్లతో స‌‌‌‌హ‌‌‌‌జ సిద్ధంగా ఉన్న ప్రభుత్వ భూమిని కాజేయాల‌‌‌‌ని చాలామంది ప్రయ‌‌‌‌త్నం చేస్తున్నారు. రాయ‌‌‌‌దుర్గం ఐటీ కారిడార్‌‌‌‌లో టీ హ‌‌‌‌బ్‌‌‌‌కు కూత‌‌‌‌వేటు దూరంలో ఉన్న ఈ భూమికి ఆనుకుని ఉన్న ప్రైవేటు ప‌‌‌‌ట్టాకు చెందిన అర ఎక‌‌‌‌రం భూమిని ఓ సంస్థకు ఆ స్థల య‌‌‌‌జ‌‌‌‌మాని అమ్మారు. ఆ ప‌‌‌‌క్కనే ఉన్న ప్రభుత్వ భూమి కూడా త‌‌‌‌క్కువ ధ‌‌‌‌ర‌‌‌‌కు అమ్మెయ్ నేను కొనేస్తాను అని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా స‌‌‌‌ర్వే నంబ‌‌‌‌రు 46లోని 84 ఎక‌‌‌‌రాల ప్రభుత్వ భూమిలోకి చొర‌‌‌‌బ‌‌‌‌డి ఎక‌‌‌‌రం భూమి వ‌‌‌‌ర‌‌‌‌కు కాజేశారు. రిజిస్ట్రేష‌‌‌‌న్ కూడా జ‌‌‌‌రిగిపోయింది. ఇలా క‌‌‌‌బ్జాల ప‌‌‌‌ర్వం కొనసాగించాల‌‌‌‌నుకునే వారికి  రెవెన్యూ, హైడ్రా అధికారులు చెక్ పెట్టారు. ఎక‌‌‌‌రం రూ. 200 కోట్ల వ‌‌‌‌ర‌‌‌‌కూ ఉండే ఈ భూమి క‌‌‌‌బ్జాకు ఆస్కారం లేకుండా చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిలోకి ఆనుకుని ఉన్న అర ఎకరం పట్టా భూమిలోకి చొరబడి గజాల వారీగా ప్లాట్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

శంషాబాద్ లో ఉద్రిక్తత..

శంషాబాద్ మండలం బహదూర్‌‌‌‌గూడ లో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణ జరుగుతున్నది. భూముల స్వాధీనం ప్రక్రియను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నష్ట పరిహారం తగినంత ఇవ్వాలని అప్పుడే భూములను అప్నగిస్తామని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరారు. మరోవైపు కొందరు రైతులు పోలీసుల కళ్లలో కారం చల్లడంతో చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్‌‌‌‌తో పాటు పలువురు సీఐలు, మహిళా సీఐలు గాయపడ్డారు. రైతులకు మద్దతుగా అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించారు. ఉద్రిక్తత నడుమనే హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేస్తున్నారు.