
- తమ ఫ్లాట్లను ఆక్రమించారని ఎఫ్‌సీఐ సొసైటీ ఫిర్యాదు
- విచారణ అనంతరం చర్యలు తీసుకున్న హైడ్రా
గచ్చిబౌలి, వెలుగు: అనుమతులు లేకుండా గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్యాజమాన్యం ఏర్పాటు చేసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఎఫ్ సీఐ ఎంప్లాయిస్ హౌసింగ్సొసైటీ స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన షెడ్లను మంగళవారం నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాల కోసం ప్రత్యేకంగా వేసిన రోడ్డును హిటాచీలతో తొలగించారు. సైబరాబాద్పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 124, 125లో 20 ఎకరాల స్థలం ఉంది.
ఇందులో ఫర్టిలైజర్స్కార్పొరేషన్ఆఫ్ఇండియా ఎంప్లాయిస్ కోపరేటివ్హౌసింగ్సొసైటీ లేఅవుట్ ఉంది. ఇందులో 162 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ లేఅవుట్‌కు ఆనుకొని సంధ్య కన్వెన్షన్ఉంది. అయితే కొంత కాలంగా ఎఫ్‌సీఐ సొసైటీ ఫ్లాట్ల యజమానులకు, సంధ్య కన్వెన్షన్ఎండీ శ్రీధర్‌రావు మధ్య స్థల వివాదం నడుస్తోంది. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఈ వివాదంపై విచారణ జరుగుతోంది. వివాద భూమిలోనే శ్రీధర్‌రావు ఎలాంటి అనుమతులు లేకుండా సంధ్య కన్వెన్షన్మినీ హాల్, వంట గదులు, రెస్ట్‌రూంలు, డెస్సింగ్రూంలుగా జీ ప్లస్ 2 పద్దతితో మూడు ఐరన్షెడ్లను నిర్మించారు.
లేఅవుట్ చుట్టూ భారీ రేకుల ఫెన్సింగ్ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఎఫ్‌సీఐ ఫ్లాట్ల యజమానులు హైడ్రా దృష్టికి తీసుకువెళ్లారు. తమ ఫ్లాట్లు గుర్తుపట్టకుండా రోడ్లను, పార్కులను కలుపుతూ అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. అక్రమ షెడ్ల కోసం సిమెంట్రోడ్డును నిర్మించారని పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు మంగళవారం భారీ హిటాచీలతో గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ వద్దకు చేరుకొని అనుమతులు లేకుండా నిర్మించిన సంధ్య కన్వెన్షన్మినీ హాల్, జీ ప్లస్ 2 పద్దతితో నిర్మించిన మూడు ఐరన్షెడ్లను కూల్చివేశారు.
ఐరన్ ఫెన్సింగ్‌ను, సిమెంట్ రోడ్డును కూడా తొలగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూల్చివేతలు కొనసాగాయి. ఇదే స్థలంలో చేపట్టిన భారీ డ్రైవ్ఇన్పై కోర్టు స్టే ఉందని, స్టే ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
శ్రీధర్‌రావుపై ఫిర్యాదుల వెల్లువ
హైడ్రా చర్యలతో ధైర్యాన్ని కూడగట్టుకున్న బాధితులు వివిధ మార్గాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. తమ ఫ్లాట్లు కబ్జా చేశారని నగరంలో ఉన్నవారే కాకుండా.. విదేశాల్లో ఉన్నవారు కూడా హైడ్రాకు ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తున్నారు. శ్రీధర్‌రావు తమను లే ఔట్‌లోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారని.. తమ ప్రమేయం లేకుండా డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు రాయించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మెయిల్స్, వీడియోల రూపంలో గోడును వెల్లబోసుకుంటున్నారు.
మేము కొనుక్కున్న ఫ్లాట్లేదని శ్రీధర్‌రావు మనుషులు చెప్పడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నారంటూ ఢిల్లీ నుంచి ఓ మహిళ ఆన్లైన్లైన్లో ఫిర్యాదు చేశారు. త్వరలో హైదరాబాద్ కు వచ్చి నేరుగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. రాయదుర్గంలోని సంధ్య టెక్నో పార్కుతోపాటు వేర్వేరు ప్రాంతాల్లో శ్రీధర్‌రావు చేసిన ఆక్రమణలపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే శ్రీధర్‌రావుపై వివిధ పోలీస్ స్టేషన్లలో చీటింగ్, కబ్జాలపై 30 వరకు కేసులు నమోదు అయ్యాయి. ఎఫ్‌సీఐ లేఔట్వివాదంపై 5 కేసులు ఉన్నట్లు బాధితులు తెలిపారు.
మైలార్‌దేవ్‌పల్లిలో గోడ కూల్చివేత..
శంషాబాద్: మైలార్ దేవుపల్లి పరిధిలోని ఇందిరాగాంధీ సొసైటీలో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన గోడను హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేశారు. పలువురు అక్రమార్కులు గొడవకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరికి భారీ బందోబస్త్నడుమ గోడను కూల్చివేశారు. దీంతో ఇందిరా గాంధీ సొసైటీవాసులు స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.