- పూర్వీకులది అని చెప్పి ఎకరం జాగాలో మకాం
- ఖాళీ చేయించి ఫెన్సింగ్ వేసిన హైడ్రా
- మరో రెండు చోట్ల పార్కు స్థలాలకూ మోక్షం
హైదరాబాద్ సిటీ, వెలుగు: మణికొండ మున్సిపాలిటీలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమితో పాటు పార్కులను శనివారం హైడ్రా కాపాడింది. ఈ భూముల విలువ దాదాపు రూ. 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మణికొండలోని పంచవటి కాలనీలో వెస్టర్న్ ప్లాజాకు చేరువలో ఉన్న ఎకర భూమికి ఎలాంటి పత్రాలు లేకుండా తమ పూర్వీకులదని చెప్పి కొందరు కబ్జా చేసి ఉంటున్నారు. ప్రభుత్వ భూమిలో కబ్జాదారులు తిష్ట వేశారంటూ వెస్టర్న్ ప్లాజాకు చెందిన వారు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
దీంతో హైడ్రా రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించి ప్రభుత్వ భూమి అని అధికారులు నిర్ధారించారు. శనివారం ఆక్రమణలను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులను ఏర్పాటు చేశారు. దీని విలువ దాదాపు రూ. 155 కోట్లు ఉంటుందని స్థానిక అధికారులు అంచనా వేశారు.
1,600 గజాల పార్కు స్థలం సైతం
ఇదే మున్సిపాలిటీలోని వెంకటేశ్వర కాలనీలో 1600 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. 1992లో లేఅవుట్ వేసినప్పుడు పార్కులు, తదితర వినియోగం కోసం కేటాయించిన ఈ స్థలంలో అనుమతి లేని లేఅవుట్‌తో కొంతమంది ఆక్రమణలకు పాల్పడ్డారు. పార్కు స్థలంలో బై నంబర్లు వేసుకుని కబ్జాలు చేశారంటూ హైడ్రా ప్రజావాణికి వెంకటేశ్వర కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. విచారణ చేయగా.. నెక్నాంపూర్ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు 1996లోనే పార్కు, తదితర వినియోగాల కోసం గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చినట్టు తేలింది.
తర్వాత మున్సిపాలిటీ అయ్యాక 2019లో ఈ స్థలాలకు అనుమతులు ఇచ్చినట్టు స్థానికులు హైడ్రాకు తెలిపారు. ఇలా పలు వివాదాల్లో ఉన్న 1600 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. దీని విలువ రూ. 25 కోట్లు ఉంటుందని అంచనా.
తిరుమల హిల్స్‌లో 6,150 గజాలు
ఇదే మున్సిపాలిటీలోని తిరుమల హిల్స్‌లో 6150 గజాల పార్కు స్థలం కూడా కబ్జాలకు గురైంది. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్లు, కాంపౌండ్ వాల్‌ను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలమని బోర్డులను ఏర్పాటు చేశారు. మార్కెట్లో ఈ భూమి విలువ రూ. 120 కోట్లు వరకూ ఉంటుందని స్థానిక అధికారులు చెబుతున్నారు.
