మల్లారెడ్డి కబ్జాపై హైడ్రా బుల్డోజర్.. జీడిమెట్లలో 15 ఎకరాల ఆక్రమణ

మల్లారెడ్డి కబ్జాపై హైడ్రా బుల్డోజర్.. జీడిమెట్లలో 15 ఎకరాల ఆక్రమణ
  • చెరువులో యథేచ్ఛగా ప్రహరీ నిర్మించిన గులాబీ నేత
  • మట్టి నింపి.. గేట్లు పెట్టి పాగా వేసిన మాజీ మంత్రి
  • ప్రహరీ, గేట్లను నేలమట్టం చేసిన హైడ్రా అధికారులు
  • పక్కనే తన సొంత భూమి
  • 40–50 ఎకరాల్లో మామిడి తోట!

కుత్బుల్లాపూర్, వెలుగు: చారిత్రక ఫాక్స్‌‌‌‌సాగర్ చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు చేసిన ఆక్రమణలను హైడ్రా కూల్చేసింది. చెరువు ఎఫ్టీఎల్‌‌‌‌లోకి సుమారు 15 ఎకరాల వరకు చొచ్చుకొచ్చి, మట్టి నింపి, ప్రహరీ కట్టి, గేట్లు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. దీన్ని సీరియస్‌‌‌‌గా తీసుకున్న హైడ్రా సోమవారం ఆ ప్రహరీ గోడను, గేట్లను నేలమట్టం చేసింది.

చెరువు పక్కనే మల్లారెడ్డికి సుమారు 40 నుంచి 50 ఎకరాల భూమి ఉందని, అందులో మామిడి తోట, ఒక బిల్డింగ్ ఉన్నాయని అధికారులు తెలిపారు. అయినా ఎఫ్టీఎల్‌‌‌‌లోకి వెళ్లి మరీ ప్రహరీ కట్టడంతో కూల్చివేశామని చెప్పారు. ఫాక్స్‌‌‌‌సాగర్ చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కొద్ది రోజుల కింద మొదలుపెట్టింది. ఇందులో భాగంగా చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగిస్తోంది.