హైడ్రా మార్షల్స్ విధుల బహిష్కరణ... జీతాలు తగ్గిస్తారనే ప్రచారంతో ఆందోళన

హైడ్రా మార్షల్స్ విధుల బహిష్కరణ... జీతాలు తగ్గిస్తారనే ప్రచారంతో ఆందోళన
  • ఓవర్ ​టైం చేస్తున్నామని, 
  • ఆఫీసర్లు గౌరవించట్లేదని ఆవేదన  
  • మార్షల్స్​తో కమిషనర్ చర్చలు 
  • జీతాలు తగ్గవని, పెంచే అంశాలను పరిశీలిస్తామని హామీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: వేతనాలు తగ్గుతాయన్న ప్రచారంతో సోమవారం హైడ్రా మార్షల్స్ ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఎమ‌ర్జెన్సీ సేవ‌లకు అంతరాయం ఏర్పడింది. బల్దియా ఈవీడీఎం విభాగంలో పనిచేసేందుకు 2020 ఫిబ్రవరిలో మార్షల్స్ ను నియమించారు. వీరంతా ఆర్మీలో పని చేసి రిటైర్డ్ అయినవారే. హైడ్రా ఏర్పడిన తర్వాత వీరిని హైడ్రాకు కేటాయించారు. 93 పోస్టులు ఉండగా, 92 మంది పనిచేస్తున్నారు. వీరిలో మాన్సూన్​ఎమర్జెన్సీ టీమ్స్ ను కో ఆర్డినేట్​చేసేందుకు జీహెచ్ఎంసీ సర్కిల్​కు ఒకరి చొప్పున 30 మందిని కేటాయించారు. 

కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ కూడా వీరి ఆధీనంలోనే ఉంది. ఎమ‌ర్జెన్సీ సేవ‌లందిస్తున్న 51 హైడ్రా డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు మాన్సూన్​టీమ్స్ వీరి కిందనే పని చేస్తున్నాయి. అయితే, వీరికి గత నెల వరకు ప్రతినెల రూ.29,250 వేతనం ఇచ్చారు. కాగా, ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న వారందరికీ ప్రభుత్వ జీవో ప్రకారం రూ.22,250 వేతనాలు వస్తుండడంతో మార్షల్స్ కి కూడా ఈ నెల నుంచి రూ.7 వేలు తగ్గించి ఇస్తారన్న ప్రచారం జరిగింది. 

దీంతో ముందస్తుగా మార్షల్స్​ఆందోళనకు దిగారు. తమ జీతం తగ్గించొద్దని డిమాండ్  చేశారు. మాన్సూన్ ఎమర్జెన్సీ అని కనీసం వీక్ ఆఫ్ కూడా లేకుండా పని చేస్తున్నామని, పైగా కొందరు అధికారులు అరేయ్.. ఒరేయ్​అంటూ గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని వాపోయారు. ఇలాగైతే తాము పనిచేయలేమన్నారు. 8 గంటల కోసం పని చేసేందుకు జాయిన్ అయ్యామని, హైడ్రా ఏర్పడిన తర్వాత ఆలస్యం అవుతున్నా పని చేస్తున్నామన్నారు. 
 
జీతాలు ఎవరికి తగ్గవు: రంగనాథ్

విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్​రంగనాథ్​ రంగంలోకి దిగి మార్షల్స్​తో హైడ్రా ఆఫీసులో సమావేశమయ్యారు. హైడ్రాలో ప‌ని చేస్తున్న సిబ్బంది జీతాలు త‌గ్గవ‌ని స్పష్టం చేశారు. పైగా జీతాలు పెంచేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు. మిగ‌తా రాష్ట్రాల్లో పని చేస్తున్న వారికి ఇక్కడికంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నట్టయితే ఆ విధానాల‌ను కూడా అధ్యయ‌నం చేస్తామ‌న్నారు. మార్షల్స్​ ఆందోళనతో ఎక్కడా ఎలాంటి సేవ‌ల‌కు ఆటంకాలు ఏర్పడ‌లేద‌న్నారు.