ఎన్నికల హామీల్లో ఉచితాలకు నేను వ్యతిరేకం : వెంకయ్యనాయుడు

ఎన్నికల హామీల్లో ఉచితాలకు నేను వ్యతిరేకం :   వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ, వెలుగు :  ఎన్నికల హామీల్లో ఉచితాలకు తాను వ్యతిరేకం అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎలక్షన్ టైంలో నేతలు ఇచ్చే హామీలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలకు 6 నెలల ముందు ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆర్థిక వనరులు ఉంటాయా? లేదా అన్నది అంచనా వేయకుండా నేతలు హామీలు ఇస్తుంటారని అభిప్రాయపడ్డారు. అయితే పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 

ఎందుకంటే దేశంలో పేద, మధ్యతరగతి, మధ్యతరగతికి దిగువన అనేకమంది ప్రజలు ఉన్నారని గుర్తు చేశారు. దీపావళి పండుగ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో వెంకయ్య నాయుడు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఢిల్లీ కాలుష్యం జాతీయ సమస్య అని అన్నారు. కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుందని, కాలుష్య నియంత్రణ అనేది కేవలం ఢిల్లీ ప్రభుత్వానిదే కాదన్నారు. కేంద్రం, పక్క రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఉందని గుర్తు చేశారు. ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారని అన్నారు.