హిందుత్వం, హిందూ.. వేర్వేరు .. నేను హిందువును: సిద్ధరామయ్య

హిందుత్వం, హిందూ.. వేర్వేరు  ..  నేను హిందువును: సిద్ధరామయ్య

బెంగళూరు: హిందుత్వ సిద్ధాంతం, హిందూ విశ్వాసాల మధ్య తేడా ఉందని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఒక వైపు మైనారిటీ ఓట్లు కోల్పోకుండానే.. హిందూ ఓట్లు దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహంగా ‘సాఫ్ట్ హిందుత్వ’ను పావుగా వాడుకుంటున్నట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. హిందుత్వలో సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ ఏంటని ఆయన నిలదీశారు.

 ‘‘హిందుత్వ అంటే హిందుత్వనే. నేను హిందువుని. హిందుత్వం, హిందూ అనేవి వేర్వేరు. మనం రాముడిని ఆరాధించలేదా? వాళ్లు (బీజేపీ) మాత్రమే రాముడిని ఆరాధిస్తున్నారా? మన గ్రామాల్లో రాముడి ఆలయాలు నిర్మించలేదా? భజనలు చేయలేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘డిసెంబర్ చివరి వారంలో భజనలు జరుగుతుంటాయి. మా గ్రామంలో వేడుకల్లో నేను పాల్గొంటుంటాను. వాళ్లు (బీజేపీ) మాత్రమేనా.. మనం హిందువులం కాదా?” అని నిలదీశారు. హిందుత్వ అంశంపై సిద్ధరామయ్య గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

మీకు హిందుత్వపై మాట్లాడే హక్కులేదు: బీజేపీ

భారత్ లేదా హిందుత్వానికి సంబంధించిన సమస్యలపై సిద్ధరామయ్య, కాంగ్రెస్‌‌కు ఎన్నడూ స్పష్టత లేదని బీజేపీ నేత సీఎన్ అశ్వత్ నారాయణ్ మండిపడ్డారు. వారు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.‘‘కాంగ్రెస్ ఎప్పుడూ విభజన రాజకీయాలకు పాల్పడుతుంటుంది. వారు చట్టాన్ని గౌరవించరు. ఈ మతపరమైన అంశాల్లోకి ఎందుకు వెళ్తారు? హిందుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు” అని చెప్పారు.