కార్తి హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో లక్ష్మణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘సర్దార్ 2’. ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించగా, ఆషిక రంగనాథ్, మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటించారు. సెప్టెంబర్ 10న విడుదలవుతున్న ఈ చిత్రం తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో అడివి శేష్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
కార్తి మాట్లాడుతూ ‘ఈ సినిమా నా కెరీర్‌లో చాలా స్పెషల్. ‘సర్దార్’కు తెలుగులోనూ పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇలాంటి స్పై క్యారెక్టర్ చేయడం నా అదృష్టం. నిజానికి గూఢచారులకు ఎలాంటి గుర్తింపూ ఉండదు. కానీ వాళ్ల పని వాళ్లు చాలా నిజాయితీతో, ఏదీ ఆశించకుండా చేస్తారు. అలాంటి పాత్రను పోషించడం సంతోషంగా ఉంది. ఇది అందరికీ నచ్చుతుంది’ అని అన్నాడు.
ఇదొక యాక్షన్ డ్రామా అని, ఇందులో తాము యాక్షన్ లుక్‌లో అలరిస్తామని హీరోయిన్స్ మాళవిక మోహన్, ఆషిక రంగనాథ్ అన్నారు. ‘సర్దార్ 2’ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని ఎస్‌జే సూర్య చెప్పాడు. కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలు రవి శంకర్, నాగవంశీ, అనిల్ సుంకర, దర్శకుడు కళ్యాణ్ శంకర్ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
