నేనేం జ్యోతిష్యురాలిని కాదు

నేనేం జ్యోతిష్యురాలిని కాదు

న్యూఢిల్లీ: అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు క‌లిసి కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాడాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీ అన్నారు. పెగాస‌స్ హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్ విష‌యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇవాళ ఢిల్లీలో జ‌రిగిన ప్ర‌తిప‌క్షాల భేటీకి హాజ‌రుకాని ఆమె.. ఈ అంశంలో పోరాటంలో మాత్రం ముందుంటాన‌ని చెప్పారు. పార్లమెంటులో త‌మ పార్టీ ఇత‌ర ప‌క్షాల‌తో క‌లసి పెగాస‌స్ విష‌యంలో కొట్లాడుతుంద‌ని చెప్పారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిశాక అన్ని ప్ర‌తిప‌క్షాలు క‌లిసి ఉమ్మ‌డి వేదిక‌పైకి వ‌చ్చి పోరాటం చేసే అంశంపై చ‌ర్చిస్తామ‌ని మమత చెప్పారు. అన్ని పార్టీల నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నామ‌ని.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌తో భేటీ అవుతానన్నారు. అయితే ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి వేదిక‌ను ముందుండి న‌డిపించే నేత ఎవ‌ర‌ని రిపోర్ట‌ర్లు ప్ర‌శ్నించ‌గా.. తానేం జ్యోతిష్యురాలిని కాద‌న్నారు. ప్రతిపక్షాలకు ఎవ‌రో ఒక‌రు నాయ‌కత్వం వ‌హిస్తార‌ని, తాను మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ఆమె చెప్పారు. మీరు లీడ్ చేయ‌బోరా అని అడుగ‌గా.. తాను సాధార‌ణ వ‌ర్క‌ర్‌న‌ని, అలానే కొనసాగాల‌ని అనుకుంటున్నాన‌ని స్పష్టం చేశారు.