విచారణకు రాలేను.. నోటీసులు రద్దు చేయండి.. సీబీఐకి కవిత లేఖ

విచారణకు రాలేను.. నోటీసులు రద్దు చేయండి.. సీబీఐకి కవిత లేఖ

తాను విచారణకు హాజరుకాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకు లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండని సీబీఐని కవిత కోరారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని లేఖలో తెలిపారు. ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని కవిత తెలిపారు. 

సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని కవిత లేఖలో పేర్కొన్నారు. 2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగ ఉందని అన్నారు. 

తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని చెప్పారు. ఇది తన ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుందని అన్నారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని తెలిపారు.  

  పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానని చెప్పారు.  ఆ సమావేశాల షెడ్యూల్ ఖరారైందని అన్నారు. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేయాలని కవిత సీబీఐని కోరారు.