- హైదరాబాద్‌లో దాడులు
- ఆరు చోట్ల పొద్దున 6 నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు
- సీఏ గోరంట్ల బుచ్చిబాబు ఇల్లు, ఆఫీసులో రైడ్స్
- 14 కంపెనీలకు చెందిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
- గతంలో ఓ ముఖ్య నాయకురాలి కంపెనీకి
- సీఏగా పనిచేసిన బుచ్చిబాబు
- రామచంద్ర పిళ్లై కంపెనీ, షెల్ కంపెనీలకు లింకులు
- షెల్ కంపెనీల లెక్కలు రాబడుతున్న ఈడీ
హైదరాబాద్ , వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. శుక్రవారం హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల దాడులు చేసింది. హైదరాబాద్‌లోని దోమలగూడ, రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ, అంబర్‌పేట్ డీడీ కాలనీలో పొద్దున 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు చేసింది. నాలుగు ట్రక్కులు, నాలుగు బస్సుల్లో స్పెషల్ ఫోర్స్ తో వచ్చిన 70 మందికి పైగా అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. దోమలగూడ అరవింద్‌నగర్‌లోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో గోరంట్ల బుచ్చిబాబు ఇల్లు, ఆఫీసుపై రైడ్ చేశారు. అంబర్‌పేట్ డీడీ కాలనీలోని గోరంట్ల ఉద్యోగి శ్రీధర్ ఇంట్లో తనిఖీలు జరిపారు. శ్రీధర్ ఇంట్లో వివిధ కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా గోరంట్ల బుచ్చిబాబును ప్రశ్నించింది. తను సీఏ, ఆడిటర్‌గా పనిచేసిన కంపెనీల వివరాలు రికార్డ్ చేసింది. ఆయా కంపెనీల లావాదేవీలకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో 14 కంపెనీలకు చెందిన కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కవితకు సీఏగా పనిచేసినట్లు సమాచారం.
చార్టెడ్ అకౌంటెంట్ వద్ద లెక్కల చిట్టా
గోరంట్ల అండ్ అసోసియేట్స్ ప్రముఖ లిక్కర్, స్పిరిట్ కంపెనీలకు సీఏ, ఆడిటర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఓ ప్రముఖ నేతకు చెందిన కంపెనీలకు గోరంట్ల బుచ్చిబాబు సీఏగా పనిచేసినట్లు తెసింది. ఇందులో రాబిన్ డిస్టిలరీస్ అడ్రస్ తో రిజిస్టర్‌అయిన అనూస్ బ్యూటీ పార్లర్ డైరెక్టర్‌గా బోయినపల్లి అభిషేక్‌రావు ఆర్వోసీ రికార్డుల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే మాదాపూర్ అలేఖ్య ప్రణవ్ హోమ్స్‌లోని అనూస్ బ్యూటీ పార్లర్ హెడ్ ఆఫీస్, రాయదుర్గంలోని అభిషేక్‌రావు ఆఫీస్, నానక్‌రాంగూడకు చెందిన ప్రేమ్‌సాగర్‌రావు ఆఫీసుల్లో సోదాలు జరిపింది. హార్డ్‌డిస్క్‌లు, ఆయా కంపెనీలకు చెందిన బ్యాంక్ లావాదేవీలు, ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత కంపెనీలకు చెందిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఐటీ చెల్లింపులు సహా ఇతర సమాచారం సేకరించినట్లు సమాచారం. గోరంట్ల బుచ్చిబాబు ఆఫీసులో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
రాంచంద్ర పిళ్లై కేసుతో లింకులు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఆగస్ట్17న సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రాంచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నాడు. ఆయన రాబిన్ డిస్టిలరీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నాడు. రాంచంద్ర పిళ్లైకి రాష్ట్రంలోని కీలక నేతలతో లిక్కర్ బిజినెస్‌లో లావాదేవీలు ఉన్నాయి. ఈ కేసులో సెప్టెంబరు 7న హైదరాబాద్‌లో ఈడీ రైడ్స్చేసింది. కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంది. వీటి ఆధారంగా రాబిన్ డిస్టిలరీ కంపెనీల డైరెక్టర్లు అభిషేక్‌రావుకు చెందిన కంపెనీలు అనుబంధ సంస్థల్లో సోదాలు చేస్తున్నది. ప్రధానంగా లిక్కర్ కంపెనీలు వాటి షెల్ కంపెనీలకు చెందిన ఆడిటర్లు, సీఏ సంస్థల్లో తనిఖీలు జరిపింది. రాబిన్ డిస్టిలరీస్, డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను గోరంట్ల అండ్ అసోసియేట్స్ చూస్తున్నట్లు ఈడీ అనుమానిస్తోంది.
ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీ ఇంట్లో తనిఖీలు
ఏపీలోని నెల్లూరులో లిక్కర్ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్‌వర్క్‌ల ప్రాపర్టీస్‌లలో, ఆ రాష్ట్రంలోని పలు ఏరియాల్లో, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ– ఎన్‌సీఆర్‌లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఒంగోల్ ఎంపీ మాగంటి శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దాడులు చేపట్టడం ఈ నెలలో ఇది రెండో సారి. ఈనెల 6న కూడా దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేసింది.
నాకు నోటీసులు రాలే
ఢిల్లీలో కూర్చొని కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తనకు నోటీస్ ఇచ్చినట్టు మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని, మీడియా వాస్తవాలు చూపించడానికి టైం వెచ్చిస్తే మంచిదని ట్విటర్ లో ఆమె పేర్కొన్నారు.
