నేను బచ్చాగాడిని.. సూర్య, ఏబీ డివిలియర్స్‌తో నాకు పోలికేంటి: పాకిస్తాన్ బ్యాటర్

నేను బచ్చాగాడిని.. సూర్య, ఏబీ డివిలియర్స్‌తో నాకు  పోలికేంటి: పాకిస్తాన్ బ్యాటర్

అప్పుడే వేసిన వరినాట్లను కొంగలు తొక్కితే ఎలా ఉంటుందో.. సౌతాఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ అచ్చం అలానే ఉంటుంది. ఇదేం పోలికా! అనుకోకండి. దాదాపు అదే తరహాలో అతని బ్యాటింగ్ శైలి ఉంటుంది. బంతి.. బ్యాట్‌ని తాకేవరకు ఎలా వెళ్తుందన్నది ఎవరికీ తెలియదు. ఇంకా చెప్పాలంటే.. బ్యాటింగ్ ఇలా కూడా చేయొచ్చా అన్న దానికి నిర్వచనం ఏబీడి. క్రీజులో కుదురుకున్నాడంటే.. ప్రత్యర్థి జట్టుకు, ఆ జట్టు బౌలర్లకు వారం రోజుల వరకూ గుర్తుంటారు. అంతటి విధ్వంసకర క్రికెటర్.

ఇక 'మిస్టర్ ఇండియా 360' సూర్యకుమార్ యాదవ్. ఏబీడి అంతటి క్రికెటర్ కాకపోయినా.. అతని వారసుడు అని చెప్పొచ్చు. కానీ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సుగా మలిచే ధైర్యం.. ఒక్క సూర్యకు మాత్రమే ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదుర్కొన్న తొలి బంతిని సిక్స్‪గా మలిచిన ఆటగాడు కూడా సూర్యానే. వీరిద్దరితో ఓ పాక్ యువ క్రికెటర్‌ను పోలుస్తూ మీడియా మిత్రులు కాస్త ఎక్కువ చేశారు. దీంతో చిరెత్తుకొచ్చిన సదరు యువ క్రికెటర్.. నేను వారి ముందు పిల్లాడిని.. వారితో నాకు పోలికేంటి అంటూ వారికి బుద్ధిచెప్పాడు. 

పాక్ యువ క్రికెటర్ మహమ్మద్ హారిస్ ACC ఎమర్జింగ్ ట్రోఫీలో పాకిస్తాన్ 'ఏ' జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతని సారథ్యంలోని పాక్ జట్టు.. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ సంధర్బంగా మీడియా సమావేశంలో పాల్గొనగా అతనిని.. సూర్య, ఏబీడిలతో పోలుస్తూ ఒక ప్రశ్న ఎదు రైంది. అందుకు అతడు అదిరిపోయే రీతిలో సమాధానమిచ్చాడు.

"ఆ ఇద్దరి క్రికెటర్లతో నన్ను పోల్చడం సరికాదు. డివిలియర్స్ వయసు.. 39, సూర్యకుమార్‌ యాదవ్ వయసు.. 32, నా వయసు 22. ఆ దశకు చేరుకోవాలంటే నేను చాలా కష్టపడాలి. డివిలియర్స్ 360 డిగ్రీ ఆటగాడు. SKY తన సొంత స్థాయిని కలిగి ఉన్నాడు. నేను ఆ స్థాయికి అప్పుడే చేరుకోలేదు. నాకంటూ ఒక స్వంత వెర్షన్‌ ఉండాలనుకుంటున్నాను.." అని హారిస్ చెప్పుకొచ్చాడు. సూర్య, ఏబీడిల స్థాయి తనది కాదని నిజం అంగీకరించనందుకు.. ఇతగాడిపై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.