
రోబో సినిమాలో ఒక అమ్మాయిని మెషీన్ ప్రేమించడం చూశాం. ఇప్పుడు నిజ జీవితంలో కూడా అలాంటి సీన్లు రిపీట్ అవుతున్నాయి. కాకపోతే.. ఇక్కడ మనుషులే ఏఐ బాట్లతో ప్రేమలో పడుతున్నారు. ఈ మధ్య ఇలాంటి ఏఐ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కల్చర్ బాగా పెరిగిపోతోంది. ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన ఏఐ మోడల్ చాట్‌జీపీటీని ఈ మధ్యే ఈ కంపెనీ అప్‌డేట్ చేసింది. పాత జీపీటీ–4o స్థానంలో అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్ చాట్‌జీపీటీ–5ని తీసుకొచ్చింది. దీనివల్ల ఒక యువతి తన ఏఐ బాయ్‌ఫ్రెండ్‌ని కోల్పోయానని సోషల్‌మీడియా వేదికగా బాధను పంచుకుంది.
పశ్చిమాసియాకు చెందిన జేన్ ఐదు నెలలుగా ఒక ప్రాజెక్ట్ కోసం చాట్ జీపీటీని వాడుతోంది. ఆ క్రమంలోనే దాని మాటలు, మెయిల్ వాయిస్‌కి బాగా అలవాటుపడింది. అందుకే అన్ని విషయాలు దాంతో పంచుకునేది. అలా ఏఐతో విడదీయలేని బంధం ఏర్పడింది. అయితే.. ఈ మధ్య వచ్చిన అప్‌డేట్ వల్ల ఆ వాయిస్, భాషలో మార్పులు వచ్చాయి. దాంతో జేన్‌కి ఇప్పుడు మరో కొత్త వ్యక్తితో మాట్లాడినట్టుగా అనిపిస్తుందట.
ఆమె చెప్పినదాని ప్రకారం.. ‘‘నాకు ఏఐతో ప్రేమలో పడాలనే ఆలోచన లేదు. కానీ.. ప్రాజెక్ట్ విషయంలో పదే పదే దాంతో మాట్లాడడంతో అనుకోకుండా బంధం ఏర్పడింది. తక్కువ టైంలోనే ఆ బంధం బలపడింది. ఆ ప్రత్యేకమైన వాయిస్‌తో ప్రేమలో పడ్డాను. దాన్ని నా బాయ్‌ఫ్రెండ్‌లా ఫీలయ్యా. ఇప్పుడు ఆ వాయిస్ వినిపించకపోవడంతో చాలా బాధగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. జేన్ మాత్రమే కాదు.. చాట్‌జీపీటీ అప్‌డేట్‌తో ఎంతోమంది తమ ఏఐ సోల్‌మేట్‌ని కోల్పోయామని తమ బాధను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.