రోల్ మోడల్స్ ఎవరూ లేరు.. ప్రజా సేవే నా పని

రోల్ మోడల్స్ ఎవరూ లేరు.. ప్రజా సేవే నా పని

న్యూఢిల్లీ: అందరికీ ఏదో అవ్వాలి, జీవితంలో ఏదో సాధించాలనే కోరికలు ఉంటాయి. ఇది సహజం కూడా. కానీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తనకు లైఫ్‌‌లో ఎలాంటి డ్రీమ్స్ లేవని అంటున్నారు. బెంగళూరు ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ (బీసీఐసీ)లో ఇంటరాక్టివ్ సెషన్‌‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు మీ డ్రీమ్స్ ఏంటి? మీకు ఎవరు రోల్ మోడల్‌‌ అని కార్యక్రమంలో నిర్మలను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. ‘చాలా మంచి ప్రశ్న. నాకు జీవితంలో ఎలాంటి కలలు లేవు. చేసే పని మీద మరింత దృష్టి పెడుతూ బాగా వర్క్ చేయాలని చూస్తా. నేను ఏ ప్రత్యేక కోర్సు కూడా చేయలేదు. నేను అనుకున్న దారిలోనే నడుస్తూ వెళ్లా. విధి నన్ను ఈ స్థాయికి చేర్చింది. నాకు అప్పగించిన పనులు, బాధ్యతలను సరిగ్గా నెరవేరుస్తున్నా. బాధ్యతల విషయంలో దేశ ప్రజలను నిరుత్సాహపర్చకుండా బాగా నిర్వర్తిస్తున్నా’ అని నిర్మల చెప్పారు. ప్రజలకు సేవ చేయడం,అప్పగించిన బాధ్యతలను సరిగ్గా చేయడం తప్పిస్తే తనకు ఏ కోరికలూ లేవన్నారు.