ఎన్నికల్లో నిలబడేది, గెలిచేది మునుగోడు ప్రజలే

ఎన్నికల్లో నిలబడేది, గెలిచేది మునుగోడు ప్రజలే

తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా మునుగోడు గురించే చర్చించుకుంటున్నారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూర్ మున్సిపల్ కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఏదో ఒక బలమైన కారణం లేకపోతే తాను రాజీనామా చేసి మళ్ళీ ఎందుకు పోటీ చేస్తానంటూ అన్నారు. 60 ఏండ్ల పోరాటం, ఎంతో మంది ఆత్మ బలిదానం వల్ల రాష్ట్రం ఏర్పడ్డదన్న ఆయన... తనకు అభివృద్ధి చేయాలన్న తపన ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధిగా అయితే ఏం చేయలేక పోయినా సొంత డబ్బులతో సహాయం చేశానని చెప్పారు. 

అధికార పార్టీ 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతో రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నదే లేకుండా పోయిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అవసరంలో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు అప్పులు తెచ్చి మరీ ఎంతో మందికి సహాయం చేశానన్నారు. కానీ తాను డబ్బులు ఇచ్చి ఎక్కడా పేరు రాసుకోలేదని చెప్పారు. ఎవరు ఎన్ని అపనిందలు వేసినా.. ఎన్ని అబాంఢాలు వేసినా భరిస్తానని అన్నారు. తాను అమ్ముడు పోయానని అసత్య ప్రచారం చేస్తున్నారు... కానీ తాను ఎప్పుడూ మునుగోడు నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని చేయనని రాజగోపాల్ స్పష్టం చేశారు. తనన కొనే శక్తి ఈ ప్రపంచంలో పుట్టలేదని, పుట్టబోదని నొక్కి చెప్పారు. ఈ ఎన్నిక తెలంగాణ ఆత్మ గౌరవం కోసం వచ్చిందన్న రాజగోపాల్ రెడ్డి... ఎన్నికల్లో నిలబడేది, గెలిచేది మునుగోడు నియోజకవర్గ ప్రజలేనన్నారు. 2014 కంటే ముందు కేసీఆర్ ఆస్తి ఎంత... జగదీశ్వర్ రెడ్డి ఆస్తి ఎంత... అని ప్రశ్నించారు. అప్పుడు తన ఆస్తి ఎంత... ఇప్పుడెంత.. అన్న ఆయన... తాను తన ఆస్తులు అమ్ముకొని తింటూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నానని స్పష్టం చేశారు. పేదవాడు ఆసుపత్రికి పోదామంటే  పోలేని పరిస్థితిలో ఆసుపత్రులు ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.