చైనా ఆర్మీ నాకు కరెంట్ షాక్ ఇచ్చింది

చైనా ఆర్మీ నాకు కరెంట్ షాక్ ఇచ్చింది

బోర్డర్ ప్రాంతంలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మిరామ్ తరోన్‌ అనే బాలుడిని కిడ్నాప్ చేసిన చైనా ఆర్మీ అతడిని తమ చెరలో హింసించింది. కట్టిపడేసి, కరెంట్ షాక్ ఇచ్చి నానా అవస్థలు పెట్టింది. ఈ విషయాలను చైనా చెర నుంచి మళ్లీ స్వదేశానికి చేరకున్న ఆ బాలుడే చెప్పాడు. ఒక జాతీయ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకున్నాడు.

కిడ్నాప్ చేసి 9 రోజుల తర్వాత అప్పగింత

జనవరి 18న మిరామ్‌ తరోన్‌ను భారత్, చైనా సరిహద్దుల్లోని సాంగ్‌ పో నది వద్ద చైనా ఆర్మీ సైనికులు కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని ఆ సమయంలో మొదట అరుణాచల్‌ ప్రదేశ్ బీజేపీ ఎంపీ తాపిర్ గావ్ వెలుగులోకి తెచ్చారు. 17 ఏళ్ల బాలుడిని చైనా కిడ్నాప్ చేసిందని, జరిగిన సంఘటనను వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం, మన ఆర్మీ వేగంగా చైనాతో సంప్రదింపులు జరిపాయి. అయితే మొదట తాము ఎవరినీ కిడ్నాప్ చేయలేదంటూ చైనా బుకాయించింది. ఆ తర్వాత మళ్లీ తాము ఒక బాలుడిని గుర్తించామంటూ తొమ్మిది రోజుల తర్వాత జనవరి 27న భారత ఆర్మీకి అప్పగించింది.

రెండు చేతులు కట్టేసి లాక్కెళ్లారు

చైనా చెర నుంచి బయటపడి.. మళ్లీ భారత్‌కు చేరుకున్న మిరామ్ తోరన్‌ తొలిసారి ఓ జాతీయ మీడియా చానెల్‌తో మాట్లాడాడు. కిడ్నాప్ చేశాక చైనా ఆర్మీ సైనికులు వ్యవహరించిన తీరును అతడు వివరించాడు. ‘‘చైనా సైనికులు తన చేతులు రెండూ కట్టేసి అడవిలోకి లాక్కెళ్లారు. ఆ తర్వాత చేతులకు బేడీలు వేశారు. తలకు ఒక క్లాత్‌తో ముసుగు వేసి.. చైనా ఆర్మీ క్యాంప్‌కు తీసుకెళ్లారు. కిడ్నాప్ చేసిన తొలి రోజు అక్కడ నన్ను చిత్రహింసలు పెట్టారు. కరెంట్‌ షాక్‌ కూడా ఇచ్చారు” అని తాను పడిన బాధల గురించి చెప్పాడు. ఇక రెండో రోజు నుంచి తనను వాళ్లు ఏమీ చేయలేదని అన్నాడు. కిడ్నాప్ చేసిన మొదటి రోజు మాత్రం దారుణంగా కొట్టారని, అయితే తిండి, నీళ్లు మాత్రం ఇచ్చారని చెప్పాడు.

మరిన్ని వార్తల కోసం..

సైకిల్‌పై పార్లమెంట్‌కు కేంద్ర మంత్రి

2020లో కొవిడ్ కేసుల కంటే ఈ 10 వారాల్లో వచ్చినవే ఎక్కువ

కరోనా బారినపడ్డ రజనీకాంత్ కూతురు.. ఆస్పత్రిలో చికిత్స