2020లో కొవిడ్ కేసుల కంటే ఈ 10 వారాల్లో వచ్చినవే ఎక్కువ

2020లో కొవిడ్ కేసుల కంటే ఈ 10 వారాల్లో వచ్చినవే ఎక్కువ
  • అప్పుడే 57 దేశాల్లో ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్ బీఏ.2 వ్యాప్తి

ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటే దాని సబ్ వేరియంట్లు మరింత ప్రమాదకరమని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ఒమిక్రాన్ కంటే దాని సబ్‌ వేరియంట్లు ఇంకా వేగంగా వ్యాపిస్తాయని పలు అధ్యయనాల్లో తేలిందని చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా గడిచిన నెల రోజుల్లో గుర్తించిన అన్ని కొవిడ్ వైరస్‌లలో 90 శాతం పైగా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లే ఉన్నాయని, బీఏ.1, బీఏ.1.1, బీఏ.2 లాంటి ఉండగా.. వీటిలో బీఏ2నే అన్నింటి కంటే వేగంగా వ్యాప్తి చెందే రకమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. బీఏ.2 ఇప్పటికే 57 దేశాల్లో వ్యాపించిందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దీని తీవ్రత, ఇమ్యూనిటీపై ప్రభావం లాంటి విషయాల గురించి తెలిసింది చాలా తక్కువని, లోతైన పరిశోధనలు జరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో టాప్ సైంటిస్ట్ మరియా వ్యాన్‌ కెర్ఖోవ్‌ తెలిపారు. బీఏ.1 కంటే బీఏ.2 కొంత వేగంగా వ్యాప్తి చెందుతోందని తేలిందని, అయితే ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ కంటే దీని లక్షణాలు సీరియస్ అని ఎక్కడా గుర్తించలేదని చెప్పారు. అయితే స్ట్రెయిన్ ఏదైనా సరే కరోనా అనేది ఇప్పటికీ ప్రమాదకరమేనని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా సోకకుండా పాటించే జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆమె సూచించారు.

వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధం కాదు.. జాగ్రత్త తప్పదు

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కరోనా ఆంక్షలను ఎత్తేస్తున్నాయని, కొన్ని దేశాలు ఏకంగా మాస్క్ అవసరం లేదని ప్రకటించడం ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అదనం గెబ్రియస్ అన్నారు. అప్పుడే కరోనాను జయించేశామని అనుకోవడం తొందరపాటు అని, కరోనా ఇంకా ప్రమాదరమేనని, అది మన కళ్ల ముందే కొత్త కొత్త వేరియంట్లుగా తనను తాను మార్చుకుంటోందని, మరింత అప్రమత్తత అవసరమని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్‌ తీవ్రత తక్కువగా ఉందని, వ్యాక్సినేషన్ వల్లే దీనిని ఎదుర్కోగలిగామని చాలా దేశాలు భావిస్తున్నాయని, ఇక ఇతర జాగ్రత్తలేవీ అక్కర్లేదనే భావనలోకి వచ్చే శాయని, ఇది పొరబాటని అన్నారు. వాస్తవానికి దూరంగా ఆలోచించొద్దని, 2020 సంవత్సరం మొత్తంలో వచ్చిన కరోనా కేసుల కంటే ఒమిక్రాన్‌ను గుర్తించిన గత 10 వారాల్లో నమోదైన కేసులు ఎక్కువని చెప్పారు. కేవలం ఈ పది వారాల్లోనే 9 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయన్నారు. ఏ ఒక్క దేశమూ వాస్తవానికి దూరంగా ఆలోచించొద్దని, కరోనాను ఎదుర్కోవాలంటే కేవలం వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదని, మాస్కు ధరించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం లాంటి జాగ్రత్తలు తప్పనిసరి అని సూచించారు. లాక్‌డౌన్లు పెట్టుకోవాలని చెప్పడం లేదని, జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం వద్దని సూచిస్తున్నామని, ఆంక్షలను కూడా ఒక్కసారిగా ఎత్తేయొద్దని టెడ్రోస్ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

24 రోజుల తర్వాత స్కూళ్లు రీ ఓపెన్

కోటి దాటిన మోడీ యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు

దేశానికి కొత్త రాజ్యాంగం కావాలె