ఆ నమ్మకం తప్పు: మగవాళ్లకు సచిన్ సందేశం

ఆ నమ్మకం తప్పు: మగవాళ్లకు సచిన్ సందేశం

‘నేను కొన్ని నమ్మకాలతో పెరిగా.. అవి తప్పని ఇప్పుడు తెలుసుకున్నా.. వాటిని మార్చాలి. మీరు ఆ తప్పులు చేయొద్దు’ అంటూ మగవాళ్లకు సచిన్ టెండూల్కర్‌ ఓ సందేశం ఇచ్చాడు. ‘‘TO THE MEN OF TODAY AND TOMORROW’’ (నేటి, భవిష్యత్తు మగవాళ్లకు) అంటూ స్టార్ట్ చేసి.. భావోద్వేగపూరితంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు మాస్టర్ బ్లాస్టర్. సచిన్ తన కెరీర్‌కు ముగింపు చెప్పిన రోజు పెవిలియన్‌కు వస్తున్నప్పుడు తాను కన్నీళ్లు పెట్టుకున్న ఘటనను గుర్తు చేసుకుంటూ నాటి తన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకున్నాడు. మగవాళ్లు ఏడవ కూడదని, ఏడిస్తే బలహీనులని అనుకునేవాడినని, కానీ ఆ ఫీలింగ్ తప్పు అని తెలుసుకున్నానని చెప్పాడు. ‘మనం కొన్ని పరిస్థితుల్లో ఫెయిల్యూర్‌ను ఎదుర్కొన్నప్పుడు ఏడ్చేయాలని అనిపిస్తుంది. దాన్ని నొక్కి పెట్టి నవ్వడానికి ట్రై చేస్తాం. అలా చేయొద్దు. ఆ ఫీలింగ్‌ను ఆపుకోవద్దు. ఏడ్చేసి.. బాధను బయటకు వెళ్లిపోనీయండి’ అని సూచించారు.

పూర్తి పోస్ట్ ఇదీ..

మీరు రేపు తండ్రిగా.. భర్తగా, అన్నగా.. టీచర్‌గా మారుతారు. మీరు చాలా ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. బలంగా ఉంటారు. అంతేకాదు, భయాన్ని కూడా ఫేస్ చేస్తారు. అనుమానాలు, అనుభవాలు, గొప్ప విజయాలను చూస్తారు. ఫెయిల్యూర్‌ని కూడా ఫేస్ చేస్తారు. ఆ టైమ్‌లో ఏడ్చేయాలనిపిస్తుంది. కానీ, కచ్చితంగా చెప్పగలను. ఆ బాధను కప్పిపెట్టి.. నవ్వు ముఖం పెట్టాలని ట్రై చేస్తారు.  కారణం.. మగపిల్లలు ఏడవకూడదు అని చెబుతూ పెంచడమే. మగవాళ్లు ఏడవకూడదు. ఏడిస్తే బలహీనమై పోతాం అనే నమ్మకంలో మనం ఉంటాం. ఇవే నమ్మకాలతో నేనూ పెరిగా. కానీ, నా నమ్మకం తప్పు అని తెలుసుకున్నా. అందుకే ఈ రోజు ఈ పోస్ట్ రాస్తున్నా. నా బాధ, పోరాటమే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం.

2013 నవంబరు 16 (సచిన్ చివరి మ్యాచ్) డేట్‌ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు గ్రౌండ్‌లో నుంచి  పెవిలియన్‌కు వెనక్కి వెళ్లేటప్పుడు వేసిన ప్రతి అడుగూ నన్ను కింది కుంగదీస్తున్నట్లు అనిపించింది. ఇక అంతా అయిపోయిందన్న ఫీలింగ్‌తో గొంతులో చెప్పలేనంత బాధ. కన్నీళ్లను ఆపుకోలేకపోయా. బుర్రలో ఏవేవో ఆలోచనలు. కానీ, ప్రపంచాన్ని ఫేస్ చేద్దాం అనిపించింది. ఆ భావోద్వేగం బయటకు వెళ్లిపోయాక చెప్పలేనంత మనశ్శాంతి పొందాను. కన్నీళ్లను దాచుకోవాల్సిన అవసరం లేదని అప్పుడు ఫీల్ అయ్యా. దాంట్లో సిగ్గుపడాల్సిందేమీ లేదు. కానీ ఆ రోజు బాధను బయపెట్టుకోవడానికి ఎంతో ధైర్యం కావాల్సివచ్చింది. కచ్చితంగా ఒక్కటి మాత్రం చెప్పగలను. బాధను కన్నీళ్ల రూపంలో బయటకు పంపేశాక.. ఆ తర్వాతి రోజు మరింత ధైర్యంగా, స్ట్రాంగ్‌గా తయారవుతాం. ఏది ఏమైనా సరే ఆ పిచ్చి నమ్మకాలు వదిలేసి.. ధైర్యంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నా.

View this post on Instagram

To the Men of Today, and Tomorrow! #shavingstereotypes

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on