పార్టీ ఫిరాయింపులపై నేను మాట్లాడను : జగ్గారెడ్డి

 పార్టీ ఫిరాయింపులపై నేను మాట్లాడను :  జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడనని, ఎందుకంటే తానే ఇప్పటి వరకు రెండు పార్టీలు మారానని కాంగ్రెస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ పదవి అడగడం కొత్త కాదని, అవకాశం వచ్చిన ప్రతిసారీ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నా అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఎవరికైనా పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తనకేం ఇబ్బంది లేదని, రెడ్డిల్లోనే ఎవరికైనా అవకాశం ఇస్తానంటే తానే రేసులో ముందుంటానని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో చిట్​చాట్ చేశారు. ‘‘రాష్ట్రంలో వంద రోజుల కాంగ్రెస్ పాలన గురించి మమ్మల్ని అడగడం కాదు.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలను అడగండి. 

వాళ్లే మా ప్రభుత్వ పనితీరు గురించి చెప్తరు. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్​లో ఉన్నడు. ఏం మాట్లాడుతున్నాడో.. ఆయనకే అర్థం కావడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరువే అని ప్రచారం చేస్తున్నరు. వర్షాలు ఎప్పుడు పడుతాయో కూడా తెలుసుకునే తెలివి బీఆర్ఎస్ లీడర్లకు లేదు. కాంగ్రెస్ అంటేనే మాదిగలు.. మాదిగలు అంటేనే కాంగ్రెస్.. కానీ, మందకృష్ణ మాదిగ బీజేపీకి లాభం జరిగేలా మాట్లాడుతున్నారు. రాష్ట్రం నుంచి ఒక మాదిగను రాజ్యసభ సభ్యుడిని చేయాలని, ఆ తర్వాత కేంద్ర మంత్రిని చేయాలని బీజేపీని ఎందుకు డిమాండ్ చేయడం లేదు?’’అని మందకృష్ణ మాదిగను జగ్గారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ బౌండరీలో ఉండి మంద కృష్ణ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. న్యూట్రల్​గా ఉండి మాట్లాడితే దేనికైనా జవాబు ఇచ్చేవాడిని అని అన్నారు.