మేడిగడ్డ వ్యవహారంపై నేనే మాట్లాడుత

మేడిగడ్డ వ్యవహారంపై నేనే మాట్లాడుత
  •     టీవీల్లో డిబేట్, ఇంటర్వ్యూలు ఇస్త: కేసీఆర్
  •     ఒకట్రెండు పళ్లు విరిగితే మొత్తం తీసేస్కుంటమ?
  •     మేడిగడ్డ కూడా అంతే.. రిపేర్ చేస్కుంటే సరిపోతది
  •     అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతమని ముందే తెలుసు
  •     అప్పటికే లేట్ కావడంతో అభ్యర్థులను మార్చలేకపోయిన
  •     కాంగ్రెస్ సర్కార్​పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కామెంట్

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ వ్యవహారంపై పార్టీ నేతలు ఎవరూ మాట్లాడొద్దని, ఆ అంశంపై తానే మాట్లాడుతానని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ స్కీమ్​లపై కూడా త్వరలో టీవీల్లో డిబేట్, ఇంటర్వ్యూలు ఇస్తానని తెలిపారు. ‘‘పళ్లల్లో ఒకటో.. రెండో విరిగితే.. మొత్తం తీసేస్కుంటమ? కొత్త పళ్లు పెట్టించుకుంటమా? మేడిగడ్డ కూడా గంతే.. ఒకటో, రెండో పిల్లర్లు కుంగినయ్.. రిపేర్ చేయించుకుంటే సరిపోతది.. అది చేయకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు..”అని కాంగ్రెస్​ నేతలపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆయన స్పందించారు.

 ‘‘పార్టీలో ఉండేటోళ్లు ఉంటరు.. పోయేటోళ్లు పోతరు.. గిదంతా సహజమే’’అని అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్​లో పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులతో కేసీఆర్ వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మరిచిపోవాలి. ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కసిగా పని చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని 15 రోజుల ముందే నేను ఊహించిన.. అప్పటికే లేట్ కావడంతో అభ్యర్థులను మార్చలేకపోయిన. 

ఇప్పుడు పరిస్థితులు మారిపోయినయ్.. కాంగ్రెస్ మీద వ్యతిరేకిత మొదలైంది’’అని కేసీఆర్ అన్నారు. ‘‘గతంలో మేము ఎల్​ఆర్ఎస్ ప్రకటిస్తే.. ప్రజల రక్తం పీల్చుతున్నామని కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేశారు. మరి ఇప్పుడు వాళ్లేం చేస్తున్నరు? అదే ఎల్ఆర్ఎస్ ను కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. వాళ్ల కుంపటి.. వాళ్లు సర్దుకోవడానికి టైమ్ సరిపోతున్నది’’అని ఎద్దేవా చేశారు. 

గెలుపు.. ఓటములు సహజం

కొద్ది రోజుల్లోనే ప్రజలకు బీఆర్ఎస్ లీడర్లు కచ్చితంగా యాదికొస్తరని కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలుపు.. ఓటములు సహజమన్నారు. బీఆర్ఎస్ పార్టీకి గెలుపు, ఓటములు కొత్త కాదని తెలిపారు. కుంగిపోయేది.. పొంగిపోయేది ఏమీ లేదని స్పష్టం చేశారు. కరీంనగర్‌‌‌‌లో వినోద్‌‌ కుమార్‌‌‌‌, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని, వారి గెలుపు కోసం పనిచేయాలని నాయకులకు కేసీఆర్ సూచించారు. మండల స్థాయిలో కమిటీలు వేసుకుని, సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. 

త్వరలోనే బస్సు యాత్రలు చేపడ్తామని వెల్లడించారు. ఈ నెల 12న కరీంనగర్‌‌‌‌లోని ఎస్‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ గ్రౌండ్స్‌‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. కనీసం లక్ష మంది సభకు వచ్చేలా చూడాలన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. 

నేడు అభ్యర్థుల ప్రకటన!

ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో సోమవారం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్ సహా మరికొన్ని సీట్లకు ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీగా మాలోతు కవిత ఉన్నారు. అయితే, ఈ ఇద్దరూ బీఆర్‌‌‌‌ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేరన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టికెట్ల ప్రకటనపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.

 మరోవైపు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌‌ రెడ్డి కూడా పోటీకి వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. చేవెళ్ల పార్లమెంట్‌‌కు సంబంధించిన నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌‌లో భేటీ అయ్యారు. రంజిత్‌‌రెడ్డి పోటీ చేయని పక్షంలో ఇంకెవరిని బరిలోకి దింపితే గెలుస్తామనే అంశంపై కేటీఆర్ ఆరా తీసినట్టు తెలిసింది. చేవెళ్ల టికెట్‌‌ను కాసాని వీరేశ్‌‌ లేదా కార్తిక్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతున్నది.