డ్రాగన్ కంట్రీపై నిఘా..సరిహద్దుల్లో యుద్ధ విమానాలు

డ్రాగన్ కంట్రీపై నిఘా..సరిహద్దుల్లో యుద్ధ విమానాలు

న్యూఢిల్లీ: డ్రాగన్ పడగపై నిఘా పెట్టింది మన ఎయిర్ ఫోర్స్. చైనా బలగాల కదలికలను ఆకాశం నుంచే గమనిస్తోంది. ఇందుకోసం యుద్ధవిమానాలు, హెలికాప్టర్లను తూర్పు​ లడఖ్​లోకి రంగంలోకి దింపింది. ‘గల్వాన్ లోయ గొడవ’ నేర్పిన పాఠంతో ముందు జాగ్రత్తలు పడుతోంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా వెంటనే దీటుగా స్పందించేందుకు సిద్ధమవుతోంది. సైన్యానికి తోడుగా సుఖోయ్ ఫైటర్ జెట్లు, అపాచీ, చినూక్ చాపర్లతో పహారా కాస్తోంది.

మిరాజ్, జాగ్వార్ కూడా..

లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంబడి మరోసారి చైనా చొరబాట్లకు పాల్పడకుండా పరిస్థితి ఎయిర్​ఫోర్స్ గమనిస్తోంది. చైనా ట్రూప్స్ కదలికలను గమనించేందుకు సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్లు, ఆపాచీ అటాక్ హెలికాప్టర్లతో రంగంలోకి దింపింది. శుక్రవారం లెహ్‌‌‌‌ పర్వత ప్రాంతాల్లో ఐఏఎఫ్‌‌‌‌ హెలికాప్టర్లతో పాటు యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. ఆర్మీకి లాజిస్టిక్స్ సరఫరా చేసేందుకు సీహెచ్47 చినూక్ హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. చైనా శిబిరాలను ప్రతిక్షణం పరిశీలిస్తూ ఉండేందుకు లడఖ్ రీజియన్​లో సుఖోయ్ జెట్లు రెగ్యులర్​గా చక్కర్లు కొడుతున్నాయి. అలాగే మిరాజ్ 2000, జాగ్వార్ యుద్ధ విమానాలు కూడా అవసరమైనప్పుడు ఫీల్డ్​లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వేగంగా యుద్ధభూమికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

చినూక్.. చాలా స్పెషల్

చినూక్ హెలికాప్టర్ల ద్వారా ఆర్మీకి అవసరమైన ఎక్వీప్​మెంట్, మందుగుండు సామగ్రిని ఎయిర్​ఫోర్స్ సరఫరా చేస్తోంది. చినూక్ చాలా స్పెషల్. అవి ఎక్కువ ఎత్తులో ప్రయాణించగలవు. అంతేకాదు ఐఏఎఫ్ దగ్గర ఉన్న ఇతర ఎయిర్​క్రాఫ్ట్​లతో పోలిస్తే ఎక్కువ లోడ్లు మోసుకుని వెళ్లగలవు. అలాగే ‘ఎంఐ17వీ5 మీడియం లిఫ్ట్ హెలికాప్టర్లు’ కూడా లడఖ్​రీజియన్​లో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

లేహ్, శ్రీనగర్​లో ఐఏఎఫ్ చీఫ్ పర్యటన

ఇండియా, చైనా సరిహద్దుల్లో టెన్షన్స్ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిర్‌‌‌‌ఫోర్స్ చీఫ్ ఆర్కే బధూరియా… లేహ్ బార్డర్​లో పర్యటించారు. సరిహద్దుల్లో భద్రత, బలగాల సన్నద్ధతపై ఆయన రివ్యూ చేసినట్లు తెలిసింది. ‘‘లేహ్, శ్రీనగర్‌‌‌‌లోని ఎయిర్ బేస్‌‌‌‌లో బధూరియా రెండు రోజులపాటు పర్యటించారు. ఈనెల 17న లేహ్​లో, 18న శ్రీనగర్​లో ఎయిర్​బేస్​లను విజిట్ చేశారు. ఈ రెండు తూర్పు లడఖ్ సెక్టార్​కు దగ్గరలో ఉన్నాయి. చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతంలో సైనిక అవసరాలను తీర్చడానికి ఈ రెండు వైమానిక స్థావరాల్లో కూడా ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్స్‌‌‌‌ను ఉంచాం’’ అని ఆర్మీ ఆఫీసర్లు చెప్పారు. అయితే బధూరియా పర్యటనపై ఐఏఎఫ్ స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ప్రశ్నించగా.. ‘నో కామెంట్స్’ అని ఐఏఎఫ్ స్పోక్స్ పర్సన్ వింగ్ కమాండర్ ఇంద్రనిల్ నంది అని అన్నారు.

రంగంలోకి ‘ట్యాంక్ కిల్లర్’

‘ట్యాంక్ కిల్లర్’​గా పేరుపొందిన ‘ఏహెచ్64ఈ అపాచీ గార్డియన్ హెలికాప్టర్ల’ను కూడా ఐఏఎఫ్ రంగంలోకి దింపింది. ఈ చాపర్లు మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి రక్షణ కల్పించడమే కాకుండా.. శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లగలవు. ఇక ఇండియా డిఫెన్స్ ఆయుధాగారంలోకి వచ్చిన తొలి అటాక్ హెలికాప్టర్ అపాచీ… పర్వత ప్రాంతాల్లోని బంకర్లను తునాతునకలు చేయగలదు. సాయుధ నిఘా, క్లోజ్ కంబాట్, మొబైల్ స్ర్టైక్​లో దిట్ట. పగలే కాదు రాత్రిపూట కూడా ఆపరేషన్ల కోసం ఉపయోగించుకోవచ్చు. చైనా ట్రూప్స్ ఉన్న ప్రాంతాలను అపాచీ చాపర్లు పరిశీలిస్తున్నాయి.

ఇండియన్ సోల్జర్లను నిర్బంధించలేదు: చైనా

ప్రస్తుతం తాము ఏ ఒక్క ఇండియన్ సోల్జర్​ను కూడా నిర్బంధించలేదని చైనా చెప్పింది. కొందరు సోల్జర్లను అదుపులోకి తీసుకున్నారంటూ వార్తలు వస్తుండటంతో స్పందించింది. ‘‘మేం ఎవర్నీ డిటైన్ చేయలేదు. రెండు దేశాలు ప్రస్తుతం చర్చిస్తున్నాయి. డిప్లమాటిక్, మిలటరీ మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి” అని చెప్పారు. మరి చైనా సోల్జర్లను ఇండియా అదుపులోకి తీసుకుందా? అని ప్రశ్నించగా.. ‘ఇందుకు సంబంధించిన సమాచారమేదీ నా దగ్గర లేదు’ అని చెప్పారు.