ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ల టీమ్
సిద్దిపేట రూరల్/గజ్వేల్, వెలుగు : ఇబ్రహీంపూర్ అభివృద్ధి బాగుందని ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ల టీమ్ కితాబునిచ్చింది. శుక్రవారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల పరిధిలోని మంత్రి హరీశ్ రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ ను మరి చెన్నారెడ్డి మానవనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 54 మంది అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారుల బృందం సందర్శించింది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి అగిడి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న ఇంకుడు గుంతలు, స్వచ్ఛ విద్యాలయ అవార్డు అందుకున్న ప్రాథమిక పాఠశాల, పార్కు, గ్రామపంచాయతీ భవనం, వైకుంఠధామం, డంప్ యార్డు, సామూహిక గొర్రెల షెడ్, ఉపాధి హామీ పనుల కింద చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి బాగున్నాయన్నారు. వారి వెంట ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో మురళీధర్ శర్మ, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్ దేవయ్య, పంచాయతీ సెక్రటరీ అర్షద్ ఉన్నారు.
మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్లాంట్సందర్శన..
గజ్వేల్మండలంలోని కొమటిబండ గ్రామంలోని మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్లాంట్‌ను బృందం సందర్శించింది. రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ నీటి సరఫరా, పథకం తీరు, నీటి స్వచ్ఛత, అమలు విధానం గురించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగార్జున రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వివరించారు. ఒరిస్సా ప్రభుత్వం తరపున జాయింట్ డైరెక్టర్ కన్నత బాలు సమన్వయకర్తగా వ్యవహరించారు.
వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి
సంగారెడ్డి టౌన్, వెలుగు : వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏలు ఆందోళన నిర్వహించారు. వారికి ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పే స్కేలు, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలయ్యేవరకు ఐక్యంగా ఉద్యమించి ప్రభుత్వం మెడలు వంచాలని వీఆర్ఏలకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కే.రాజయ్య, వీఆర్ఏల జేఏసీ నాయకులు లక్ష్మీనారాయణ, నాగరాజు, నర్సింగ్ రావు, మురళి, లక్ష్మణ్, మల్లేశ్, వీఆర్ఏలు పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో అర్హులైనవారికి ఈనెల 28న కొత్త పింఛన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం మున్సిపల్ ఆఫీస్‌లో వార్డు స్పెషల్ ఆఫీసర్, మెప్మా సిబ్బంది, ఆర్పీ, బిల్ కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో కొత్త పింఛన్ ప్రొసీడింగ్ కాపీలు, కార్డుల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. మున్సిపాలిటీలోని మొత్తం 43 వార్డులకు సంబంధించి 57 ఏండ్లు పైబడిన 1819 మందితో పాటు, వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళ పింఛన్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. లబ్ధిదారులందరికీ సీరియల్ నంబర్ల ప్రకారం టోకెన్స్ పంపిణీ చేసి, వారు కార్యక్రమానికి వచ్చేలా చూసే బాధ్యత వార్డు స్పెషల్ ఆఫీసర్, ఆర్పీ , బిల్ కలెక్టర్లదేనన్నారు.
టీచర్ పోస్టులు ఎందుకు భర్తీ చేయరు?
మెదక్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయట్లేదని, వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతి ఎన్నికల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చి, ఆ తర్వాత మరిచిపోయిందని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా 50 వేలకుపైగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
నర్సాపూర్ అభివృద్ధికి సహకరించాలి
నర్సాపూర్, వెలుగు : నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ కోరారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీలోని సమస్యలను వెంటనే పరిష్కరించి ఆదర్శంగా నిలవాలన్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉందని, వాటిని అడవుల్లో వదిలేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు కోతుల దాడిలో మృతి చెందిన బాలుడు మణికంఠకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, వైస్ చైర్మన్ నయీమ్, కౌన్సిలర్లు అశోక్ గౌడ్, గోడ రాజేందర్, సంగసాని సురేశ్, లలిత, అధికారులు పాల్గొన్నారు.
గీతంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్
రామచంద్రాపురం, వెలుగు : పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వ విద్యాలయంలో శుక్రవారం గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ (జీసీజీసీ) ఆధ్వర్యంలో యూకే, యూఎస్ఎడ్యుకేషనల్ ఫెయిర్ ను నిర్వహించారు. డైనమిక్ వరల్డ్ ఎడ్యుకాట్ కమ్యూనిటీ(డీడబ్ల్యూసీ) , గీతం కేరిర్ ఆప్షన్ల సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేసినట్లు జీసీజీసీ డైరెక్టర్ నాతి వేణుకుమార్ తెలిపారు. కార్యక్రమంలో గీతం విద్యార్థుల తల్లి తండ్రులతో విశ్వ విద్యాలయాల ప్రతినిధులు సంభాషించారు. ఉపకార వేతనాలు, దరఖాస్తు ప్రక్రియ, కోర్సులు, వసతి సౌకర్యం తదితర అంశాల గురించి వివరించారు. అనంతరం విదేశీ వర్సిటీల ప్రతినిధులు గీతం ఉన్నతాధికారులతో, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో వర్సిటీ ఆఫ్కాలిఫోర్నియా, సదర్ కాలిఫోర్నియా, ఇల్లినాయిస్(చాకాగో- స్ర్పింగ్‌ఫీల్డ్) డేటన్, మసాచుసెట్స్, డూండీ, యార్క్, నాటింగ్ హమహ వర్సిటీలతోపాటు న్యూ స్కూల్ ఆఫ్ అర్కిటెక్చర్ ప్రతినిధులుపాల్గొన్నారు.
వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలి
నారాయణఖేడ్, సిద్దిపేటరూరల్, పాపన్నపేట, వెలుగు : ప్రజలు వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. శుక్రవారం నారాయణఖేడ్పట్టణంలోని శేఖర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పీస్ మీటింగ్ లో ఖేడ్ ఇన్చార్జి డీఎస్పీ బాలరాజ్ తో కలిసి ఆయన మాట్లాడారు. శాంతిభద్రతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆయా ప్రాంతాల్లో గణనాథుల మండపాల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పోలీస్ శాఖకు సూచించారు. సిద్దిపేటలో త్రీటౌన్ సీఐ భాను ప్రకాశ్ స్టేషన్ పరిధిలోని డీజే నిర్వాహకులతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వినాయక మండపాల వద్ద, నిమజ్జనం సమయంలో డీజే లు పెట్టవద్దని ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాపన్నపేటలోని ఫంక్షన్ హాల్ లో శుక్రవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ మాట్లాడుతూ విగ్రహాలను ఏర్పాటు చేసేటప్పుడు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పింఛన్ల మంజూరులో అన్యాయం
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట మున్సిపాలిటీలో కొత్త పింఛన్ల మంజూరులో అన్యాయం జరిగిందని బీజేపీ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 44 వార్డుల నుంచి మొత్తం 6,450 మంది దరఖాస్తు చేసుకుంటే, కేవలం 1,876 మందికి మాత్రమే మంజూరు చేయడమేంటని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా నుంచి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నా తూతూ మంత్రంగా కొత్త పింఛన్లు మంజూరు చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట బీజేపీ నేత
కొత్తపల్లి వేణుగోపాల్ ఉన్నారు.
కానిస్టేబుల్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు
సిద్దిపేట రూరల్/మెదక్‌టౌన్, వెలుగు : కానిస్టేబుల్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సిద్దిపేట సీపీ ఎన్.శ్వేత, మెదక్ ఎస్సీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. శుక్రవారం వారు వారి ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28న కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించే కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలలోకి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరని, బ్యాగులు, సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ పరికారాలు పర్మిషన్ లేదని చెప్పారు. అభ్యర్థులు పరీక్షా సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, శాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో 30, మెదక్జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
స్టూడెంట్స్‌కు క్వాలిటీ ఫుడ్ అందించాలి
మెదక్(కౌడిపల్లి), వెలుగు: స్టూడెంట్స్‌కు క్వాలిటీ ఫుడ్ అందించాలని డీఈవో రమేశ్‌కుమార్ సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కౌడిపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉంటే విద్యార్థులు తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. సరిపడ గదులు లేక, ఉన్నవాటిలో సరిగా వెలుతురు రాక, కాలేజీ చుట్టూ ఫెన్సింగ్లేక సమస్యగా ఉందని, కాలేజీ కింద రెస్టారెంట్ ఉండడంతో ఇబ్బంది ఉందని ఇన్చార్జి ప్రిన్సిపల్ ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై డీఈవో స్పందిస్తూ ఆర్సీవోతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంఈవో బుచ్యా నాయక్ ఉన్నారు.
‘డబుల్’ ఇండ్ల పంపిణీకి రెడీ చేయండి
సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రెడీ చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆఫీస్ లో చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. కంప్లీట్అయిన ఇండ్ల వద్ద తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ ఏర్పాటు, ఇతర సౌకర్యాలు కల్పించి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, ఎమ్మార్వో విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూ ఎస్, పంచాయతీరాజ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
జోగిపేటకు డయాలిసిస్ సెంటర్ మంజూరు
జోగిపేట, వెలుగు : జోగిపేట ఏరియా ఆస్పత్రిలో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. స్థానికంగా డయాలిసిస్ సెంటర్ లేకపోవడంతో రోగులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, మంత్రి హరీశ్‌రావు దృష్టికి ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పలుమార్లు తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రభుత్వం సెంటర్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడంతో ఎమ్మెల్యే శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి కతజ్ఞతలు తెలిపారు.
గ్రీన్ టన్నెల్ గా రాజీవ్ రహదారి
సిద్దిపేట/కోహెడ, వెలుగు : వచ్చే రెండేండ్లలో రాజీవ్ రహదారి మొత్తాన్ని మల్టీ లేయర్లలో మొక్కలు నాటి గ్రీన్ టన్నెల్ గా అభివృద్ధి చేస్తామని స్టేట్ స్పెషల్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావుతో కలిసి సిద్దిపేట నుంచి బెజ్జంకి మండలం వరకు రాజీవ్ రహదారి వెంట రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పది రోజులలోపు రాజీవ్ రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్ పూర్తిచేయాలని సూచించారు. నాటిన ప్రతీ మొక్క పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. హరితహారంలో భాగంగా రాష్ట్ర
వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా, 8 ఏళ్లలో 267 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. శనిగరం, గాగిల్లాపూర్ గ్రామాల వద్ద రోడ్డు పక్కన మల్టీ లేయర్ లో మొక్కలను నాటి, సంరక్షణ చర్యలు చేపట్టడాన్ని చూసి అధికారులను అభినందించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అన్నను చంపింది తమ్ముడే
తాగుడుకు బానిసై గొడవ పడుతున్నాడని మర్డర్
మెదక్ (చిన్నశంకరంపేట), వెలుగు: చిన్నశంకరంపేట మండలం అగ్రహారం శివారులో యాదగిరి అనుమానాస్ప స్థితిలో చనిపోగా తమ్ముడే ఆ హత్య చేసినట్టు తేల్చారు. రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం... మండల పరిధిలోని శాలిపేటకు చెందిన యాదగిరి గౌడ్, అంజాగౌడ్ అన్నదమ్ములు. గవలపల్లిలో తల్లి సుజాతతో కలిసి ఉంటున్నారు. యాదగిరి ఆటో డ్రైవర్ కాగా అంజాగౌడ్ కార్ డ్రైవర్. మద్యానికి బానిసైన యాదగిరి ఇంట్లో గొడవపడుతూ ఉండేవాడు. గత బుధవారం అన్నదమ్ములిద్దరూ గవలపల్లి చౌరస్తా నుంచి గొడవపడుతూనే అగ్రహారం వైపు నడుచుకుంటూ వెళ్లారు. అన్న తీరుతో విసుగు చెందిన అంజాగౌడ్ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను యాదగిరిపై పోసి నిప్పంటించి పారిపోయాడు. స్థానికులు గుర్తించి యాదగిరిని అతడిని మెదక్ జిల్లా ప్రభుత్వ దవాఖానాకు తరలించగా చనిపోయాడు. తల్లి కంప్లయింట్ ఇవ్వగా అనుమానంతో అంజాగౌడ్ ను అదుపులోకి తీసుకోగా తనే నిప్పంటించినట్టు అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.
