ODI World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్లో ఈ సారి ఆ రూల్ లేదు.. ఐసీసీ ఏం చెప్పిందంటే..?

ODI World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్లో ఈ సారి ఆ రూల్ లేదు.. ఐసీసీ ఏం చెప్పిందంటే..?

ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫైనల్ ఎంత థ్రిల్లర్ ని తలపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ కప్ ఫైనల్ అన్నింటిలో  ఇదే బెస్ట్ ఫైనల్ అనడంలో అతిశయోక్తి లేదు. లార్డ్స్ లో జరిగిన ఈ  ఫైనల్ గెలిచేందుకు ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్లు తమ శక్తికి మించి పోరాడాయి. కానీ విజయం మాత్రం ఇంగ్లాండ్ నే వరించింది. అయితే ఈ మ్యాచ్ న్యూజిలాండ్ మాత్రం ఓడిపోయిందని చెప్పలేం. ఐసీసీ అప్పటికప్పుడు తీసుకున్న కొన్ని కారణాల వలన ఇంగ్లాండ్ టైటిల్ ఎగరేసుకుపోయింది. 

అసలేం జరిగిందంటే..?

సాధారణంగా వన్డే మ్యాచ్ టై అవడం చాలా అరుదు. దశాబ్దానికి ఒకటి రెండు మినహాయిస్తే టై అనే మాట అసలు వినపడదు. కానీ 2019లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేయగా ఛేజింగ్ లో ఇంగ్లాండ్ అంతే స్కోర్ చేసింది. దీంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ కి దారి తీసింది.

అయితే సూపర్ ఓవర్ లో కూడా ఇరు జట్లు 15 పరుగులు చేసినా బౌండరీల లెక్క పద్ధతి ప్రకారం ఇంగ్లాండ్ ని విజేతగా ప్రకటించారు. ఇంగ్లాండ్ మొత్తం 26 బౌండరీలు కొట్టగా.. న్యూజీలాండ్ 17 కొట్టింది. అప్పటికప్పుడు అర్ధం లేకుండా తీసుకున్న ఈ రూల్ కారణంగా కివీస్ జట్టుకి  తీరని అన్యాయం జరిగుందని చాలా మంది క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడ్డారు. 

గెలిచేవరకు ఆడాల్సిందే..

ఇదిలా ఉండగా ఈ సారి మ్యాచ్ టై అయితే ఫలితం వచ్చేవరకు సూపర్ ఓవర్ ఆడాల్సిందే. అనగా ఒక సూపర్ ఓవర్ టై అయితే మరో సూపర్ ఓవర్, అది కూడా టై అయితే మరొకటి ఇలా ఒక జట్టు గెలిచేవరకు ఫైనల్లో సూపర్ ఓవర్ ఆడుతూనే ఉండాలి. దీంతో అసలైన విజేత ఎవరో బయట పడుతుంది.