Wanindu Hasaranga: అంపైర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వనిందు హసరంగాపై నిషేధం

Wanindu Hasaranga: అంపైర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వనిందు హసరంగాపై నిషేధం

ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. అంపైర్‌ను దూషించినందుకు, అతనిపై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.13 కింద 50 శాతం జరిమానాతో పాటు 3 డీమెరిట్ పాయింట్లు విధించింది. దీంతో అతని మొత్తం డీమెరిట్ పాయింట్లు 5కు చేరడంతో రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ పడింది. 

అదే మ్యాచ్‌లో ఐసిసి ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు గానూ ఆఫ్ఘన్ వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్‌పై ఐసిసి చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ అందుకున్నాడు. వీరిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు ఐసీసీ తెలిపింది. దీంతో తదుపరి విచారణ అనవసరమని వెల్లడించింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు లిండన్ హన్నిబాల్, రవీంద్ర విమలసిరి, థర్డ్ అంపైర్లు ఈ ఆరోపణలు ఐసీసీ రిఫరీ ముందుంచారు. 

అసలేం జరిగిందంటే..?

బుధవారం(ఫిబ్రవరి 21) దంబుల్లా వేదికగా శ్రీలంక- ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య లంక జట్టు 3 పరుగుల తేడాతో పరాజయం పాలవ్వగా.. ఓటమికి అంపైరే కారణమని లంక అభిమానులు ఆరోపించారు. ఈ మ్యాచ్‌ ఆఖరి ఓవర్లో శ్రీలంక విజయానికి 3 బంతుల్లో 11 పరుగులు కావాలి. ఆ సమయంలో ఆఫ్గాన్‌ బౌలర్‌ వఫాదర్‌ వేసిన బంతి.. లంక బ్యాటర్‌ కమిందు మెండిస్‌ నడుము కంటే ఎత్తులో వెళ్లింది. లెగ్‌ అంపైర్‌గా ఉన్న హన్నిబల్‌ దాన్ని నోబాల్‌గా ప్రకటించలేదు. దీంతో  లంక 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై హసరంగ మాట్లాడుతూ.. "అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అలాంటివి మరోసారి జరగకూడదని తెలిపాడు. బంతి మరి కొంచెం ఎత్తుకు వెళ్లి ఉంటే, అది బ్యాట్స్‌మన్ తలకు తగిలేదని అన్నాడు. స్పష్టంగా నో బాల్ అని కనిపిస్తున్నప్పటికీ, అతను చూడలేకపోయాడంటే.. సదరు అంపైర్ అంతర్జాతీయ క్రికెట్‌కు సరిపోడని వ్యాఖ్యానించాడు. అతను మరో పని చూసుకుంటే మంచిదని సలహా ఇచ్చాడు. మా బ్యాటర్‌ రివ్యూ కోసం ప్రయత్నించాడు. థర్డ్‌ అంపైర్‌ను ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌పై రివ్యూ కోరవచ్చు. కానీ ఈ రకమైన నో బాల్స్‌ విషయంలో ఎందుకు రివ్యూకి వెళ్లకూడదో స్పష్టమైన నియమం లేదు.." అని హసరంగా అన్నాడు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఐసీసీ హసరంగాపై చర్యలు తీసుకుంది.