టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ను వెంటాడుతున్న వాన దేవుడు

టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ను వెంటాడుతున్న వాన దేవుడు

ఐర్లాండ్​‑అఫ్గానిస్తాన్​​, ఆస్ట్రేలియా‑ఇంగ్లండ్​ మ్యాచ్​లూ రద్దు
సూపర్​ 12లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం


ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ సంచలన ఫలితాలతో అభిమానులకు కిక్‌‌‌‌ ఇస్తోంది. రెండుసార్లు ప్రపంచ కప్‌‌‌‌ విన్నర్‌‌‌‌ వెస్టిండీస్‌‌‌‌ క్వాలిఫయింగ్‌‌‌‌ దశలోనే నిష్క్రమించడం.. మాజీ చాంపియన్‌‌‌‌ శ్రీలంక చచ్చీచెడి సూపర్‌‌‌‌ 12కు రావడం..  పాకిస్తాన్‌‌‌‌పై టీమిండియా అద్భుత విజయం..  ఇంగ్లండ్‌‌‌‌కు ఐర్లాండ్‌‌‌‌, పాక్‌‌‌‌కు జింబాబ్వే షాక్‌‌‌‌ ఇవ్వడం చూసి క్రికెట్‌‌‌‌ అభిమానులు ఫుల్​ ఖుషీ అయ్యారు. కానీ, ఆ ఆనందాన్ని ఆవిరి చేసేలా పలు జట్లను వాన దేవుడు వెంటాడుతున్నాడు. ఐదు రోజుల నుంచి ఆటకు ఇబ్బంది కలిగిస్తున్నాడు. తాజాగా శుక్రవారం మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌లో ఐర్లాండ్‌‌‌‌–అఫ్గానిస్తాన్‌‌‌‌, ఆస్ట్రేలియా–ఇంగ్లండ్‌‌‌‌ మధ్య జరగాల్సిన రెండు మ్యాచ్‌‌‌‌లూ ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచి పెట్టుకుపోయాయి. దాంతో, నాలుగు జట్లకు ఒక్కో పాయింట్‌‌‌‌ లభించింది. ఇంగ్లండ్‌‌‌‌–ఆసీస్‌‌‌‌ పెద్ద మ్యాచ్‌‌‌‌పై లోకల్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌ ఎన్నో ఆశలు పెట్టుకోగా.. అవి నీరుగారాయి.  రాత్రి వర్షం తగ్గినా ఔట్​ ఫీల్డ్​ తడిగా ఉండటంతో మ్యాచ్​ను రద్దు చేశారు. దాంతో, ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లు ఫ్యాన్స్​కు మంచి ఫన్​ ఇస్తుంటే.. మధ్యలో వరుణుడి ఎంట్రీతో అందరూ ఫ్రస్ట్రేషన్‌‌‌‌కు గురవుతున్నారు. వివిధ వేదికల్లో మరికొన్ని రోజులూ  వర్ష సూచన  ఉండగా.. మరిన్ని మ్యాచ్​లు రద్దయితే ఈ వరల్డ్​ కప్​ ప్రాభవం కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.

14 మ్యాచ్‌‌‌‌ల్లో ఐదింటిపై వాన దెబ్బ...

ఇండియా ఆతిథ్యం ఇచ్చిన 2016 టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో రెండే మ్యాచ్‌‌‌‌లు అది కూడా తొలి రౌండ్​లో వర్షం వల్ల ఎఫెక్ట్‌‌‌‌ అయ్యాయి. గతేడాది యూఏఈలో జరిగిన గత ఎడిషన్‌‌‌‌లో ఒక్క మ్యాచ్‌‌‌‌కు కూడా ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ, ఇప్పుడు సూపర్‌‌‌‌12 రౌండ్‌‌‌‌లో జరిగిన 14 మ్యాచ్‌‌‌‌ల్లో  ఐదు వర్ష ప్రభావితం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో నాలుగు రద్దవగా.. మరో మ్యాచ్​లో డక్​ వర్త్ వాడాల్సి వచ్చింది. వర్షం అంతరాయం కలిగిన ఈ ఐదింటిలో  నాలుగు మ్యాచ్‌‌‌‌లు గ్రూప్‌‌‌‌–1లోనివే కావడం గమనార్హం. ఇందులో మూడు మెల్​బోర్న్​లో జరగ్గా.. మరోదానికి హోబర్ట్​ ఆతిథ్యం ఇచ్చింది.  ఈనెల 24న హోబర్ట్‌‌‌‌లో సౌతాఫ్రికా–జింబాబ్వే మ్యాచ్​వర్షం వల్ల రద్దయింది. 9 ఓవర్లకు కుదించిన ఈ పోరులో ఒక ఇన్నింగ్స్‌‌‌‌ మాత్రమే సాధ్యం అవగా... రెండో ఇన్నింగ్స్‌‌‌‌ పూర్తి కాలేదు. ఆపై, బుధవారం మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ వేదికగా ఐర్లాండ్‌‌‌‌–ఇంగ్లండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో వాన వల్ల డక్త్‌‌‌‌ వర్త్‌‌‌‌ పద్ధతిలో ఐర్లాండ్‌‌‌‌ను విజేతగా తేల్చారు. తర్వాత న్యూజిలాండ్‌‌‌‌–అఫ్గాన్‌‌‌‌ పోరులో టాస్‌‌‌‌ కూడా పడలేదు. గురువారం  సిడ్నీలో బంగ్లాదేశ్‌‌‌‌–సౌతాఫ్రికా,  ఇండియా–నెదర్లాండ్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు వాన వల్ల  కాస్త ఆలస్యమైనా పూర్తి ఓవర్లు పడ్డాయి. అయితే, శుక్రవారం మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌లో రెండు మ్యాచ్‌‌‌‌ల్లో టాస్‌‌‌‌ కూడా సాధ్యం కాలేదు. 

ఒకే రోజు ఒకే వేదికపై వరుస మ్యాచ్​లతోనే సమస్య?...

ఆస్ట్రేలియాలో ఇలాంటి వాతావరణం ఉన్న సమయంలో టోర్నీని ఎలా షెడ్యూల్‌‌‌‌ చేస్తారంటూ ఐసీసీని ఫ్యాన్స్​ తిట్టిపోస్తున్నారు. అయితే, ఆసీస్‌‌‌‌లో ఇప్పుడు వర్షా కాలం కాదు. వసంత రుతువు నడుస్తోంది. నవంబర్‌‌‌‌–మార్చిని సమ్మర్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ సీజన్‌‌‌‌గా భావిస్తారు. కానీ, ఆసీస్‌‌‌‌లో వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు కాబట్టి ఐసీసీ, ఆతిథ్య దేశాన్ని తిట్టలేం. అయితే, ఒక రోజు ఒకే వేదికలో రెండు, మూడు మ్యాచ్‌‌‌‌లను షెడ్యూల్‌‌‌‌ చేయాల్సింది కాదనిపిస్తోంది. గత ఎడిషన్‌‌‌‌తో పాటు, 2016లో ఇండియాలో ఒకే రోజు రెండు మ్యాచ్‌‌‌‌లను వేర్వేరు స్టేడియాల్లో నిర్వహించారు. ఇప్పుడు కూడా అలా చేయాల్సింది. ప్రస్తుతానికి మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ తప్ప ఇతర వేదికల్లో వర్షం పెద్దగా అంతరాయం కలిగించకపోవడం సానుకూలాంశం. మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌లో తదుపరి మ్యాచ్‌‌‌‌ నవంబర్‌‌‌‌ ఆరో తేదీన ఇండియా–జింబాబ్వే మధ్య షెడ్యూల్‌‌‌‌ చేశారు. 13న అక్కడే ఫైనల్‌‌‌‌ జరగనుంది. ఆలోపు వెదర్‌‌‌‌ మారాలని ఆశించాలి.

ఎవరికి నష్టం... ఎవరికి లాభం...

సూపర్​12లో ప్రతి గ్రూప్​ నుంచి రెండేసి జట్లు సెమీస్​ చేరుకుంటాయి. గ్రూప్​–2 నుంచి ఇప్పటికైతే టాపర్​ ఇండియా (4 పాయింట్లు) బెర్తు దాదాపు ఖాయం అయినట్టే. మరో ప్లేస్​ కోసం సౌతాఫ్రికా (3), జింబాబ్వే (3), బంగ్లాదేశ్(2)​తో పాటు పాకిస్తాన్​ (0)​ రేసులో ఉంది. వాస్తవానికి పాక్​ రెండు మ్యాచ్​ల్లో ఓడిపోవడంతో సౌతాఫ్రికాకు మొగ్గు ఉండాల్సింది. కానీ, జింబాబ్వేతో పోరులో ఆ జట్టు గెలిచే స్థితిలో ఉన్నప్పుడు వాన రావడంతో మ్యాచ్​ రద్దయి ఒకే పాయింట్​లభించింది.  ఇది సఫారీలకు మైనస్​ కాగా.. పాక్​ను ఓడించిన జింబాబ్వేకు ప్లస్​. ఇక, గ్రూప్​1లో పరిస్థితి అన్ని జట్లనూ ఇబ్బంది పెట్టేలా మారింది. ప్రస్తుతానికి ఒక మ్యాచ్​ రద్దయి, మరో మ్యాచ్​లో గెలిచిన న్యూజిలాండ్​ 3 పాయింట్లు, మంచి రన్​రేట్​తో టాప్​ ప్లేస్​లో ఉంది. మూడేసి మ్యాచ్​ల్లో ఒక్కో గెలుపు, ఓటమి, రద్దుతో ఇంగ్లండ్​,ఐర్లాండ్​, ఆస్ట్రేలియా కూడా మూడు పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తొలి మ్యాచ్​లో కివీస్​ చేతిలో చిత్తయిన  డిఫెండింగ్​ చాంప్​ ఆసీస్ కంటే  ఐర్లాండ్​ ముందుంది. దీనికి వాననే కారణం. ఇక, ఐర్లాండ్​తో పోరులో వర్షం అంతరాయం వల్ల డక్​వర్త్​ను ఆశ్రయించడంతో ఇంగ్లండ్​అనూహ్యంగా ఓడిపోయింది. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్​ల్లో బలమైన కివీస్​, శ్రీలంకతో ఆడాలి. ఈ రెండింటిలో గెలవడంతో పాటు రన్​రేట్​ కూడా ఇంగ్లండ్​కు కీలకం కానుంది.  ఇక, ఆసీస్​ తమ చివరి రెండు మ్యాచ్​ల్లో చిన్న జట్లు ఐర్లాండ్​, అఫ్గానిస్తాన్​ ను ఎదుర్కోవాల్సి ఉండటం దానికి కాస్త సానుకూలాంశమే. ఈ గ్రూప్​లో వర్ష ప్రభావితం కాని ఏకైక జట్టు శ్రీలంక తదుపరి  కివీస్​, ఇంగ్లండ్​తో పాటు అఫ్గాన్​తో ఆడాల్సి ఉంటుంది. వీటిలో రెండింటిలో గెలిస్తేనే  లంక సెమీస్​ రేసులో ఉంటుంది. ఇక, మూడు మ్యాచ్​ల్లో ఒకటి గెలిచి, రెండు రద్దవడంతో ఒక పాయింట్​తో చివరి ప్లేస్​లో ఉన్న అఫ్గానిస్తాన్​ సెమీస్​ రేసుకు దూరమైనట్టే. కాకపోతే ఇతర జట్ల  అవ​కాశాలను దెబ్బతీయొచ్చు.